logo

ఉగాదికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సిందే

ఉగాది నాటికి జగనన్న కాలనీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్థానిక అధికారులను ఆదేశించారు.

Published : 05 Feb 2023 04:32 IST

లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే: ఉగాది నాటికి జగనన్న కాలనీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. రేపల్లె 18 వార్డు శివారున ఏర్పాటు చేసిన లేఔట్‌ను ఆమె శనివారం సందర్శించారు. వీఆర్వో సంస్థ ఆధ్వర్యంలో యానాదులకు నిర్మిస్తున్న 140 ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. కష్టపడి ఇల్లు నిర్మించుకుంటున్నారు.. ఎంత కష్టమొచ్చినా అమ్ముకోవద్దని మహిళలకు హితవు పలికారు. ఇంటి నిర్మాణ పనుల్లో తలమునకలై పనులకు వెళ్లనందున నా వంతుగా కుటుంబానికి 25 కిలోల చొప్పున 140 కుటుంబాలకు బియ్యం ఇస్తున్నానంటూ ఆయా కుటుంబాలకు పంపిణీ చేయించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షలతో పాటు పొదుపు సంఘాల సభ్యులకు రూ.35 వేలు చొప్పున రుణం ఎంతమందికి ఇచ్చారని ఆర్‌పీలను అడగ్గా సరైన సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ శాఖ పీడీ జేవీఎస్‌కెవి ప్రసాద్‌, డీఈ ఏవీ సుబ్బారావు, తహసీల్దారు వీరవసంతరావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, కమిషనర్‌ విజయసారథి, వీఆర్వో సంస్థ ప్రతినిధి వేలంగినిరాజు, ఏఈలు అనిత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


170 విద్యుత్తు మోటార్ల చోరీపై ఫిర్యాదు

రేపల్లె జగనన్న కాలనీలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇనుము, ఇటుక, ఇసుక, కంకర వంటి ఇంటి నిర్మాణ సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోతున్నారంటూ కాలనీని సందర్శించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు లబ్ధిదారులు శనివారం ఫిర్యాదు చేసి చోరీల కట్టడికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు 170కి పైగా విద్యుత్తు మోటార్లు దొంగతనానికి గురయ్యాయని మొరపెట్టుకున్నారు. కష్టపడి పనులు చేసి కూడబెట్టుకున్న నగదుతో ఇంటి నిర్మాణ సామగ్రి కొనుగోలు చేస్తే రాత్రికిరాత్రే మాయమవుతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఇలా దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వారి నుంచి రికవరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎస్సై భరత్‌కుమార్‌ ఆమెకు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని