logo

వాడకుంటే వెనక్కే!

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, రోగుల సేవల కోసం ఏటా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌)కి నిధులు వస్తాయి.

Published : 06 Feb 2023 05:33 IST

పీహెచ్‌సీ, సీహెచ్‌సీల ఖాతాల్లో మూలుగుతున్న నిధులు
ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు మీనమేషాలు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, వట్టిచెరుకూరు

ముట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుర్చీలు లేక నిలుచున్న రోగులు

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, రోగుల సేవల కోసం ఏటా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌)కి నిధులు వస్తాయి. వాటిని ఖర్చు పెట్టడానికి యంత్రాంగానికి చేతులు రావడం లేదు. ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారంతా ప్రభుత్వోద్యోగులే. అయినా ఆ నిధులను సకాలంలో వెచ్చించకుండా మురగపెట్టడం ప్రశ్నార్థకమవుతోంది. ఉమ్మడి గుంటూరులోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఇప్పటికీ రూపాయి ఖర్చు పెట్టని ఆస్పత్రులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పీహెచ్‌సీలకు రూ.1.75 లక్షలు, సామాజిక ఆస్పత్రులకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వస్తాయి. వాటిని వినియోగించుకుని ఆస్పత్రులను సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ యంత్రాంగానికి చిత్తశుద్ధి లోపించడంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా రంగులు వెలిసిన గోడలు కనిపిస్తాయి. విరిగిపోయిన కుర్చీలు, పనిచేయని పరికరాలతో కొట్టుమిట్టాడుతాయి. వాటన్నింటికి హెచ్‌డీఎస్‌ నిధులు వెచ్చించుకుంటే ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగవుతాయి. రోగులకు అసౌకర్యాలు తప్పుతాయి.

ఖాతాల్లో రూ.లక్షల నిధులు

అనేక ఆస్పత్రుల్లో ఆ నిధులు వచ్చినివి వచ్చినట్లు హెచ్‌డీఎస్‌ ఖాతాలకు పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ఆస్పత్రి గుమ్మం తొక్కిన రోగులకు కనీసం అక్కడ డాక్టర్‌కు చూపించుకునే వరకు కూర్చోవటానికి బల్లలు, బెంచీలు, కుర్చీలు ఉండవు. ఎంతసేపైనా నిలువుకాళ్ల మీద నిలబడాల్సిందే. మాత్రలు వేసుకోవడానికి గుక్కెడు నీళ్లు ఉండవు. అత్యవసరంగా మూత్ర పరీక్ష చేయాల్సి వస్తే మూత్రం ఇవ్వటానికి మరుగుదొడ్లు ఉండవు. ఇలాంటి దుస్థితిలో అనేక ఆస్పత్రులు ఉన్నాయి. ఇవేమి పట్టని యంత్రాంగం చివరకు నిధులు మురగపెట్టేస్తోంది.

* ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 96 ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాలు, 22 సామాజిక ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులను మార్చిలోపు వెచ్చించాలి. నిర్దేశిత వ్యవధిలోపు ఖర్చు చేయకపోతే తిరిగి వాటిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉన్న ఆస్పత్రులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఆ నిధుల వ్యయానికి కొంత ప్రొసీజర్‌ మారిందని, అవగాహన కల్పించుకుని ఖర్చు చేయడానికి కొంత ఆలస్యమవుతోందని వైద్యులు తెలిపారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆ నిధుల వినియోగం బాగా తక్కువగా ఉంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో నిధులు బాగా మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో వట్టిచెరుకూరు, కాట్రపాడు, ముట్లూరు, పెదనందిపాడు, పెదకాకాని, వెనిగండ్ల తదితర పీహెచ్‌సీలతో పాటు పలు సామాజిక ఆస్పత్రులకు వచ్చిన నిధులు ఇప్పటి దాకా రూపాయి కూడా వెచ్చించలేదు. విచిత్రం ఏమంటే ఆ ఆస్పత్రులకు కనీసం కమిటీలే ఏర్పాటు కాలేదు. పీహెచ్‌సీలకు ఆ మండల ఎంపీపీతో పాటు ఎంపీడీవో, తహసీల్దారు, వైద్య అధికారులు, పొదుపు సంఘాల ప్రతినిధులు, వైద్యశాల సీనియర్‌ అసిస్టెంట్‌ సభ్యులుగా ఉంటారు. వీరి ఆధార్‌కార్డులు ఇప్పటి దాకా అందలేదని, అందుకే నిధులు ఖర్చుపెట్టలేని పరిస్థితి ఏర్పడిందని వట్టిచెరుకూరు, కాట్రపాడు, మూట్లూరు ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి. నిధులొచ్చి నాలుగైదు నెలలైతే ఇప్పటి దాకా కమిటీలు ఏర్పాటు చేయకపోవడం ఆస్పత్రి వైద్యాధికారుల నిర్వాకాన్ని తెలియజేస్తోంది. పల్నాడు జిల్లా అమరావతి సామాజిక ఆస్పత్రికి రూ.4లక్షలు వస్తే ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడు పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు రాగా అవీ ఖాతాలోనే మూలుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోకి వచ్చినా ఆ నిధులతో చేపట్టే పనుల కోసం ఇప్పటి దాకా అసలు కార్యాచరణ సిద్ధం చేయలేదు. ఆస్పత్రికి అవసరమైన మందులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి సమకూర్చుకోవడానికి అయ్యే రవాణా ఛార్జీలు, రోగుల దాహార్తి తీర్చడానికి ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, రోగులకు కూర్చోవటానికి బల్లలు, కుర్చీలు, ఏమైనా వైద్య పరికరాలు అవసరమైతే వాటిని కొనుగోలు చేయటానికి, ఆస్పత్రిలో కంప్యూటర్ల మరమ్మతులు, స్టేషనరీ కొనుగోలుకు వెచ్చించుకోవచ్చు. చాలా ఆస్పత్రుల్లో పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. ఆ నిధులను వీటికి వెచ్చించుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అప్రమత్తమైతే తప్ప ఆ నిధుల వ్యయానికి మోక్షం కలగదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని