logo

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పదో తరగతి పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీఈఓ వెంకటప్పయ్య తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఉపాధ్యాయులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 05:33 IST

‘న్యూస్‌టుడే’తో డీఈవో వెంకటప్పయ్య
అమరావతి, పెదకూరపాడు, న్యూస్‌టుడే

పదో తరగతి పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీఈఓ వెంకటప్పయ్య తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఉపాధ్యాయులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది పది పరీక్షలో ఉత్తర్ణత శాతం తగ్గిందని, దాన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అమరావతికి వచ్చిన ఆయన పది పరీక్షలపై ప్రణాళికలు, సన్నద్ధతపై ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

128 కేంద్రాలు.. 26,324 మంది విద్యార్థులు

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగనున్నాయి. వీటి నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలు ఎంపిక చేశాం. మొత్తం 439 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 24,378 మంది రెగ్యులర్‌, 1,946 మంది ప్రైవేటు.. మొత్తం 26,324 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరీక్ష కేంద్రాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహిస్తాం. నరసరావుపేటలో బస్టాండు వెనకు ప్రకాష్‌నగర్‌లోని సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో స్పాట్‌వాల్యూషన్‌ నిర్వహిస్తాం.

వెనుకబడిన వారికి ప్రత్యేక తర్ఫీదు

సమ్మెటివ్‌, ఫార్మేటివ్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా వెనుకబడిన సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తర్ఫీదు ఇస్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులతో సబ్జెక్టు వారీగా సమీక్షించాం. ఏ సబ్జెక్టులో విద్యార్థి వెనుకబడి ఉన్నాడో గుర్తించి, అందులో ప్రత్యేక చొరవ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. కరోనా కారణంగా గతేడాది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈసారి మెరుగైన ఫలితాల సాధనే ధ్యేయంగా కృషి చేస్తున్నాం.

మానసిక స్థైర్యం  కల్పిస్తున్నాం

పది పరీక్షలంటే విద్యార్థుల్లో ఎంతో భయం ఉంటుంది. ఉత్తీర్ణత అవ్వకపోతే విద్యార్థులు మానసికంగా కుంగిపోతుంటారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు కావాల్సిన మార్గదర్శకాలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. నిపుణులు తయారు చేసిన మాదిరి ప్రశ్నపత్రాలతో సాధన చేయిస్తున్నాం.

పక్కాగా ఏర్పాట్లు  : విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా చూడాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మరుగుదొడ్లు, మంచినీరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తాం.

వెంకటప్పయ్య,  జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని