logo

పనులు చేయకుండానే నిధుల డ్రా

పనులు చేయకుండానే బిల్లు చేసి, సొమ్ములు డ్రా చేసి ఇతర పనులకు సంబంధించి పంచాయతీకి జమైన నిధులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం సర్పంచి ఎన్‌.ఖాజాబి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 06 Feb 2023 05:31 IST

అన్యాయంగా చెక్‌ పవర్‌ నిలిపివేత: తిమ్మరాజుపాలెం సర్పంచి

పర్చూరు, న్యూస్‌టుడే: పనులు చేయకుండానే బిల్లు చేసి, సొమ్ములు డ్రా చేసి ఇతర పనులకు సంబంధించి పంచాయతీకి జమైన నిధులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం సర్పంచి ఎన్‌.ఖాజాబి ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసేందుకు ఒత్తిడి చేసి ఇవ్వలేదనే కారణంతో చెక్‌పవర్‌ నిలిపేశారని కలెక్టర్‌కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రత్యేకాధికారి పాలనలో సచివాలయ భవనం నిర్మాణం పేరుతో రెండు ఎఫ్‌టీవోల ద్వారా ఉపాధి నిధులు పంచాయతీ ఖాతాకు రూ.3,26,404లు జమకాగా 2020 మే 7న డ్రా చేసినట్లు బ్యాంకు ఖాతా పరిశీలిస్తే వెల్లడవుతుందన్నారు. నిధులు డ్రా చేసిన సమయంలో సచివాలయ భవనం పనులు ప్రారంభం కాలేదని, 2022 ఆగస్టు తర్వాత పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 2021 ఆగస్టు 2న ఉపాధి నిధులు కొన్ని పంచాయతీ ఖాతాకు జమయ్యాయని, వాటిని సచివాలయ భవనం కింద ఇవ్వమని ఎంపీడీవో, ఈవోపీఆర్డీ ఒత్తిడి చేసినట్లు వివరించారు. బలహీన వర్గానికి చెందిన తాను బీసీ కాలనీలో రహదారి పనులు చేసినా వాటికి బిల్లులు చేయకుండా పంచాయతీరాజ్‌ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, అప్పు తెచ్చి చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. పాత బిల్లు ఇవ్వకుండా ప్రస్తుతం మళ్లీ పనులు చేయాలని ఎంపీడీవో, ఈవోపీఆర్డీ మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. అధికారులు సహకరించనందున గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచి ఖాజాబి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు ప్రతులను ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ కార్యదర్శి తదితరులకు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని