Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ

రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లను ఈనెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.

Updated : 06 Feb 2023 14:33 IST

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తావనకు వచ్చింది. పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విచారణ జరగనందున తమకు ఇప్పటి నుంచి కనీసం 2 వారాల సమయం ఇస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫు న్యాయవాదులకే ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమర్థించారు. 

ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 

రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పునకు అనుకూలంగా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై గతేడాది నవంబరు 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నాడు కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేశారు. కానీ ఆరోజు విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని (ఫిబ్రవరి 23) సుప్రీంకోర్టు ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని