logo

నిలిచిన టీకాల సరఫరా

పసి పిల్లల ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాల సరఫరా నిలిచిపోయింది. టీకాలు సరఫరా చేసే వాహనాలకు డీజిల్‌ ఆయిల్‌ కొనుగోలు చేసేందుకు నిధుల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తడడమే దీనికి కారణం.

Published : 07 Feb 2023 06:02 IST

షెడ్డులో ఆగి ఉన్న టీకా సరఫరా వాహనం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: పసి పిల్లల ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాల సరఫరా నిలిచిపోయింది. టీకాలు సరఫరా చేసే వాహనాలకు డీజిల్‌ ఆయిల్‌ కొనుగోలు చేసేందుకు నిధుల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తడడమే దీనికి కారణం. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన టీకాలను గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ప్రాంతీయ టీకా నిల్వ కేంద్రం నుంచే సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన వాహనాలు, బడ్జెట్‌ కేటాయింపులు జరిగినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు రావడంతో టీకాలు ఎప్పుడు పంపిణీ జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది.

సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు ప్రతి బుధ, శనివారాల్లో పిల్లలకు, గర్భిణులకు అవసరమైన టీకాలు ఇస్తుంటారు. ప్రకాశం జిల్లాలో టీకాల నిల్వ తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి అవసరమైన టీకాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పని చేస్తున్న సుమయఖాన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ జిల్లా పాలనాధికారి ఆదేశాలిచ్చారు. గతనెల 10వ తేదీన ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా హనుమంతురావు బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఆయనకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. జాతీయ ఆరోగ్య పథకం కింద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకునేందుకు వీలు పడటంలేదు. దీంతో డీజిల్‌ కొనుగోలుకు అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా వాహనాలు కదలడంలేదు. దీనివల్ల టీకాలు ఇతర జిల్లాలకు సరఫరా నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని