logo

తనయ వివాహం చూసి తనువు చాలించి..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి క్షణాలవి. కుమార్తె వివాహం చేయాలన్న కోరిక  అలాగే ఉండిపోయిందని బాధపడేవారు.

Published : 07 Feb 2023 06:02 IST

అనారోగ్యంతో తహసీల్దార్‌ మోహనరావు మృతి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి క్షణాలవి. కుమార్తె వివాహం చేయాలన్న కోరిక  అలాగే ఉండిపోయిందని బాధపడేవారు. చివరి క్షణాల్లో ఉన్న ఆయన బలమైన కోరిక తీర్చేందుకు కుమార్తె వివాహం ముఖ్యమైన బంధువుల మధ్య జరిపించారు. వెంటిలేషన్‌పై ఉన్న తండ్రికి కూతురు, అల్లుడు కంటిముందు కనిపించారు. ఆయన చేతికి అక్షతలు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందారు. కొద్ది గంటలకే ఆయన తనువు చాలించారు. గుంటూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తహసీల్దార్‌ మోహనరావు రెవెన్యూలో అందరికీ సుపరిచితులు. ఆయన తండ్రి కలెక్టరేట్‌లో దఫేదారుగా పని చేశారు. ఆ తర్వాత మోహనరావు ఉద్యోగం అక్కడి నుంచి మొదలై తహసీల్దార్‌ స్థాయికి చేరుకున్నారు.  పెదనందిపాడు మండలంలోనూ, గుంటూరు ఆర్డీవో కార్యాలయంలోనూ మరికొన్ని ప్రాంతాల్లో పని చేశారు. జిల్లాల విభజన తర్వాత కర్లపాలెం తహసీల్దార్‌గా పని చేస్తూ బాపట్ల కలెక్టరేట్‌ ఏవోగా ఆయన నియమితులయ్యారు. కొవిడ్‌ సమయంలోనే భార్య చనిపోయారు. కుమారుడు, కుమార్తెల బాధ్యత ఆయనపైనే ఉంది. కరోనా సమయం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  కనీసం కుమార్తె వివాహమైనా చేయాలని మధనపడేవారు. పరిస్థితి వెంటిలేటర్‌పై ఉండే స్థితికి చేరుకోగా.. గత శనివారం సాయంత్రం ఆయన కుమార్తె వివాహం ముఖ్య బంధువుల సమక్షంలో జరిగింది. అనంతరం తండ్రి వద్దకు వెళ్లి నూతన వధూవరులు ఆశీర్వాదం తీసుకున్నారు. అదే రోజు రాత్రి పొద్దుపోయాక ఆయన మరణించారు. ఆయన  సన్నిహితులు  ఏటీ అగ్రహారంలోని నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని దర్శించి నివాళి తెలిపారు. ఆదివారం రోజు ఆయన అంతిమ కార్యక్రమాలు జరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు