logo

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

స్పందన, రెవెన్యూ అర్జీల పరిశీలనకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 07 Feb 2023 06:02 IST

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి,   చిత్రంలో జేసీ రాజకుమారి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే:  స్పందన, రెవెన్యూ అర్జీల పరిశీలనకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీలు మళ్లీ తెరుచుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలను అధికారులు స్వయంగా పరిశీలించాలన్నారు. వాటిని పరిష్కరించి నివేదిక అందించాలన్నారు. ఏపీ సేవ పోర్టల్‌లో ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే పరిష్కరించాలన్నారు. శ్మశాన వాటికలకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జేసీ జి.రాజకుమారి, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ ఎం.వెంకటశివరామిరెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో 143 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.  


అంబేడ్కర్‌ భవన నిర్మాణం పూర్తి చేయాలని వినతి

గుంటూరు నగరంలోని అంబేడ్కర్‌ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ఎస్‌సీడబ్ల్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిద బాబూరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్‌.ఐజాక్‌ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. 11 ఏళ్లుగా అంబేడ్కర్‌ భవనం అభివృద్ధికి ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు ఇస్తున్నామని తెలిపారు.  


రుణం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు: నంబూరు విజయభాస్కర్‌రావు

నాది పెదకాకాని మండలంలోని నంబూరు. నాకు ఎంఎస్‌ఎంఈ కింద రూ.10 లక్షల రుణం మంజూరైంది. సీజీజీబీ బ్యాంకు నంబూరులోనే ఖాతా ఉండటంతో అదే బ్రాంచికి రుణం బదిలీ చేస్తామని చెప్పారు. రుణం వచ్చినప్పటి నుంచి బ్యాంకు అధికారులు తిప్పుతున్నారు. తన సోదరి ఓ బ్యాంకు శాఖలో ఉద్యోగి. రుణానికి ఆమె హామీగా ఉంటానని చెప్పారు. రుణం కోసం గతేడాది జూన్‌ నుంచి బ్యాంకు అధికారిని సంప్రదిస్తున్నా ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో నంబూరులో పెద్ద సంఖ్యలో రుణాలు మంజూరు చేశారు. వారికి డబ్బులు కూడా ఖాతాలో జమ చేశారు. నాకు మాత్రం ఇవ్వలేదు. గ్రామంలో సౌండ్‌ బాక్సులు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నా. ఈ రుణంతో వ్యాపారం మరింత వృద్ధి చేసుకుందామంటే అవకాశం లేకుండా పోతుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.


సమీప బంధువే పొలం కాజేసే ప్రయత్నం

అంజనాదేవి

కలెక్టరేట్‌(గుంటూరు):  ‘పుట్టింటివారు పసుపు కుంకుమ కింద పెళ్లప్పుడు ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం. సమీప బంధువే ఆ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓసారి కోర్టుకెళ్లి ఓడిపోయినా మరోసారి వేరే మార్గంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’.. అని వాపోయారు తెనాలి మండలం కొలకలూరుకు చెందిన అంజనాదేవి. ఆమె మాట్లాడుతూ .. ‘గ్రామంలోని 133/7 సర్వే నెంబర్‌లో నాకు 50 సెంట్ల పొలం ఉంది. దీనిపై సొసైటీలో పలుమార్లు రుణం పొందాం. సమీప బంధువు గతంలో ఇది తన భూమి అని కోర్టులో కేసు వేసి ఓడిపోయారు. ఇప్పుడు సర్వే నెంబర్‌ ఒకటేననే వంకతో భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. అప్పటి వరకు అడంగల్‌ నా పేరుతో ఉండగా ప్రస్తుతం రెడ్‌మార్క్‌ చేశారు. దీనిపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయని చెప్పి అధికారులు అర్ధంతరంగా నోటీసు పంపి ఆ భూమి అతని పేరుతో మార్చుతున్నామని, కోర్టు తీర్పు వచ్చాక అప్పటి పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి’.. అని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని