logo

ఆధారం దూరమై.. బతుకు భారమై..

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు (70), సామ్రాజ్యం (65) అలియాస్‌ సాంబులుది అన్యోన్య దాంపత్యం.

Published : 07 Feb 2023 06:02 IST

దమ్మాలపాడులో వృద్ధ దంపతుల బలవన్మరణం

వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం (పాతచిత్రాలు)

జీవిత చరమాంకంలో చెయ్యిపట్టి నడిపించాల్సిన పిల్లలెవరూ దగ్గరిగా లేరు.. ఇంటి దీపమైన ఇల్లాలు మంచాన పడింది.. ప్రేమ, ఆప్యాయతలు పెంచుకున్న వారి మరణాలు కుంగదీశాయి.. ప్రతి అవసరానికి వేరొకరిపై ఆధారపడటం కష్టంగా అనిపించింది.. బతుకు భారమై.. జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు బలవన్మరణం చెందారు. చిన్న కుమారుడి దంపతుల్ని ఇంటికి పిలిపించుకుని వారితో మనసారా మాట్లాడిన తర్వాత పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

దమ్మాలపాడు (ముప్పాళ్ల), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు (70), సామ్రాజ్యం (65) అలియాస్‌ సాంబులుది అన్యోన్య దాంపత్యం. వారిద్దరూ కష్టజీవులు. వ్యవసాయాన్నే నమ్ముకుని కుమార్తె, ఇద్దరు కుమారుల్ని పెంచి పెద్ద చేయడమే కాకుండా వారికి ఎంతోకొంత ఆస్తుల్ని సమకూర్చారు. కుమార్తె రాగమ్మను గ్రామంలోని వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమారుడు మస్తాన్‌రావుతోపాటు ఆయన కుమారుడు లీలాప్రసాద్‌ అంటే వారికి ప్రేమ. లీలాప్రసాద్‌ 2019లో బలవన్మరణం చెందాడు. మనువడి మరణం నుంచి కోలుకోకముందే కుమారుడు కిడ్నీ సమస్యతో మూడేళ్ల కిందట మృతి చెందాడు. కుమారుడి వైద్యంతోపాటు కుటుంబానికి చేసిన అప్పుల్ని ఎకరన్నర పొలం అమ్మి తీర్చారు. చిన్న కుమారుడు వెంకట్రావు, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితమే నరసరావుపేట వెళ్లి అక్కడే నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు మస్తాన్‌రావు ఇంటి పక్కనే ఉన్న పోర్షన్‌లో వృద్ధ దంపతులు ఉంటున్నారు. సామ్రాజ్యం నరాల సంబంధ సమస్యతో రెండేళ్ల కిందట మంచాన పడింది. అప్పట్నుంచి ఆమెకు అన్నీతానై వెంకటేశ్వర్లు చూసుకుంటున్నారు. మస్తాన్‌రావుకు ఆయన సతీమణి బాలమ్మ ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకోవాలనే ప్రయత్నం చేశారు. భర్త చనిపోయిన తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. గ్రామంలోని దొడ్డిస్థలం తీసుకుని వృద్ధ దంపతుల్ని చూడాలని కోరినా అనారోగ్యంతో బాలమ్మ ముందుకు రాలేదు. దీంతో కుమార్తె రాగమ్మకు ఐదు నెలలక్రితం ఆ స్థలాన్ని రాసిచ్చారు. అప్పట్నుంచి ఆమె ఇంటికి వెంకటేశ్వర్లు వెళ్లి భోజనంచేసి భార్యకు తెచ్చి పెడుతున్నారు. తల్లిదండ్రుల్ని కుమార్తె బాగానే చూసుకుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏం జరిగిందో ఏమో.. వృద్ధ దంపతులకు ఏమనిపించిందో నరసరావుపేటలో నివాసముంటున్న చిన్న కుమారుడు వెంకట్రావును రమ్మని కబురు పంపారు. వెంకట్రావు, అంజమ్మ దంపతులు ఆదివారం ఇంటికి రావడంతో వారితో రాత్రి 10 గంటల వరకు మాట్లాడుతూ గడిపారు. మీకేం కాదు మేం చూసుకుంటామని కుమారుడు వారికి ధైర్యం చెబితే.. మీరు జాగ్రత్త అంటూ వారినే ఆ దంపతులు సముదాయించారు. ఆ తరువాత ఇంటి లోపల చిన్న కుమారుడి దంపతులు నిద్రపోయారు. ఆరుబయట నిద్రించిన వృద్ధ దంపతులు పురుగు మందుతాగి చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున బయటకు వచ్చిన కోడలు విగతజీవులుగా పడి ఉన్న అత్తామామల్ని చూసి షాక్‌కు గురయ్యారు. అమ్మానాన్న ఇలా చేస్తారని ఊహించలేదని కుమారుడు వెంకట్రావు, కుమార్తె రాగమ్మ కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకుని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వృద్ధ దంపతుల మృతదేహాల్ని సందర్శించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జనసేన నాయకుడు వెంకటఅప్పారావు సహకారంతో రూ.10 వేలు నగదును అందజేశారు. వృద్ధ దంపతులు అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో మృతి చెందినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ కుటుంబీకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు