logo

కిడ్నీ భద్రం సుమా!

మాచర్లకు చెందిన సుబ్బారావు (25) తీవ్రమైన నీళ్ల విరేచనాలతో గుంటూరు సర్వజనాసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమైనట్లు గుర్తించిన వైద్యులు డయాలసిస్‌ చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు.

Updated : 09 Mar 2023 04:41 IST

మాచర్లకు చెందిన సుబ్బారావు (25) తీవ్రమైన నీళ్ల విరేచనాలతో గుంటూరు సర్వజనాసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమైనట్లు గుర్తించిన వైద్యులు డయాలసిస్‌ చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు.


తెనాలికి చెందిన లక్ష్మి(22) ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు వచ్చి అది మూత్రపిండ వైఫల్యానికి దారి తీసినట్లు వైద్యులు గుర్తించి డయాలసిస్‌ చేయడంతో ఆమె కోలుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

మూత్రపిండాలు.. గట్టిగా పిడికెడంత పరిమాణంలో కూడా ఉండవు గానీ.. ఈ రెండూ మన శరీరంలో ఉన్న భారీ శుద్ధి కర్మాగారాల వంటివి. నిరంతరం రక్తం నుంచి మలినాలను వడబట్టేస్తూ.. మన శరీరంలో శుభ్రతా కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉంటాయి. చక్కటి ఆరోగ్యంతో మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఇవి సజావుగా పని చేస్తుండటం, వీటి వడపోత సమర్థంగా ఉండటం చాలా అవసరం. ఆధునిక కాలంలో మూత్రపిండాలకు అడుగడుగునా గండాలే ఎదురవుతున్నాయి. మన జీవనశైలి కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతూ.. అంతిమంగా ఇవి మూత్రపిండాలను బలి తీసుకుంటున్నాయి. ఈ రుగ్మతల కారణంగా ‘దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి’ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కిడ్నీలను కాపాడుకోవడం, కిడ్నీ జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం, అవి దెబ్బతినకుండా ముందుగానే గుర్తించడం మనందరి విధి అని ప్రపంచ కిడ్నీ దినం నినదిస్తోంది. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

జీజీహెచ్‌లో డయాలసిస్‌ ఉచితం

డయాలసిస్‌ ప్రాణదాయని. కిడ్నీలు విఫలమైనవారి పాలిట సంజీవని. జీజీహెచ్‌లో డయాలసిస్‌ ఉచితంగా చేస్తున్నారు. ఒంట్లోని ప్రతి కణానికీ అత్యవసరమైన ఆక్సిజన్‌ను, పోషకాలను చేరవేసే రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు రెండూ చేతులెత్తేసినపుడు.. శరీరంలో వ్యర్థాలు, విషతుల్యాలు, నీరు అంతకంతకూ ఎక్కువవుతూ గుండె వంటి కీలకావయవాలు భారం మోయలేక పడకేస్తున్నప్పుడు బయటి నుంచే రక్తాన్ని జల్లెడ పడుతూ కిడ్నీలు చేసే పనిని సమర్థంగా నిర్విర్తిస్తూ ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్న అద్భుత వరం. కానీ డయాలసిస్‌ విధానంపై సరైన అవగాహన లేక ఇంతటి వరాన్ని సద్వినియోగం చేసుకోలేక ఎంతోమంది ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు.

బుధ, శనివారాల్లో పరీక్షలు

పొరుగు రోగుల విభాగం 18వ నంబరు గదిలో బుధ, శనివారాల్లో రోగులను పరీక్షిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైతే 218 వార్డులో చేర్చుకుంటారు. అత్యవసర చికిత్స 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు తప్పకుండా తీసుకురావాలి.


జబ్బు తెలుసుకోవడానికి తేలికైన పరీక్షలు

కిడ్నీల పనితీరు తగ్గిపోతూ, అవి విఫలమవడం మొదలైనా తొలి దశలో ఎలాంటి బాధలూ ఉండవు. బాధలు మొదలయ్యే సరికే నష్టం ఆరంభమైపోతుంది. కాబట్టి మనం ముందు నుంచే మూత్రపిండాలపై ఒక కన్నేసి ఉండటం అవసరం. ఏడాదికి ఒకసారైనా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మూత్ర పరీక్ష చేయించుకుని, దానిలో సుద్ద(ఆల్బుమిన్‌) పోతుందేమో చూసుకోవాలి. సాధారణంగా కిడ్నీల పనితీరు తెలుసుకునేందుకు రక్త పరీక్ష చేసి ‘సీరమ్‌ క్రియాటినైన్‌’ ఎలా ఉందన్నది చూస్తుంటారు. అయితే ఇదొక్కటే కాకుండా కిడ్నీల వడపోత ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఈజీఆర్‌ఎఫ్‌ చేయించుకోవడం అవసరం. మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. రోజుకి అరగంట వ్యాయామం చేయడం మంచిది. బాధితులు వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయాలి. సర్వజనాసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత చికిత్సలను రోగులు వినియోగించుకోవాలి.

 మహమ్మద్‌ అస్లాం, సహాయ ఆచార్యులు, నెఫ్రాలజీ విభాగం, జీజీహెచ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని