logo

ముంగిట ఉగాది.. ఇంటికి దారేది?

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఆపసోపాలు పడుతోంది. ఉగాది నాటికి కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేయించాలని పెట్టుకున్న లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు.

Published : 10 Mar 2023 04:58 IST

ఖర్చు పెరగడంతో ఆసక్తి చూపని లబ్ధిదారులు
జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణంలో ఇదీ సంగతి
ఈనాడు-నరసరావుపేట, న్యూస్‌టుడే-నరసరావుపేట టౌన్‌

నరసరావుపేటలో పునాదుల దశ దాటని నిర్మాణాలు

వరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఆపసోపాలు పడుతోంది. ఉగాది నాటికి కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేయించాలని పెట్టుకున్న లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. క్షేత్రస్థాయి యంత్రాంగం లబ్ధిదారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నా నిర్మాణాల్లో ప్రగతి అంతంత మాత్రమే. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అనుకున్న మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు కొన్నాళ్లుగా లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో నిర్మాణాలు పూర్తిచేయడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా పాలనాధికారుల వరకు వరుసగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది జగనన్న కాలనీల వారీగా నిర్మాణాల్లో ఉన్న ఇళ్ల ప్రగతిని రోజువారీగా సమీక్షిస్తూ నిర్మాణాలు పూర్తిచేయాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు. ఈక్రమంలో వచ్చే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చు పెరగడం, బిల్లులు సకాలంలో రాకపోవడంతో అంతగా ఆసక్తి చూపడం లేదు. మూడో విభాగం కింద గుత్తేదారు నిర్మించే ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు నిర్మాణాలను చూసుకోవడానికి కూడా రాకపోవడం గమనార్హం. గుత్తేదారు చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతి అంతంతమాత్రంగానే ఉంది.

అంతర్గత రహదారులు లేని ఉప్పలపాడు అర్బన్‌ లేఔట్‌

నిధుల విడుదలలో జాప్యం

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఉపాధి హామీ పథకంలో 90 రోజుల పని దినాల ద్వారా ఒక్కొక్క పనిదినానికి రూ.257 చొప్పున రూ.23130 సమకూరుతుంది. మరో రూ.12వేలు స్వచ్ఛభారత్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయినా మరుగుదొడ్డి సొమ్ము విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి నిధుల విడుదలపై స్పష్టత రాలేదు. మరోవైపు ఇంటి నిర్మాణ బిల్లుల చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. చేతిలో ఉన్న సొమ్ము వెచ్చించిన లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి బిల్లు వస్తే కానీ పనులు ముందుకు చేయలేని పరిస్థితి. ఇంజినీరింగ్‌ సహాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో రుణం మీరు ఇప్పిస్తారా? అని కొందరు లబ్ధిదారులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న తాము తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఇంజినీరింగ్‌ సహాయకులు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక సమయంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారందరూ నిర్మాణాల వద్దకు వచ్చేటప్పటికీ అంతగా ఆసక్తి చూపకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

సొమ్ము సరిపోక ఇబ్బందులు

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల సొమ్ము సరిపోవడం లేదు. డెల్టా ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇచ్చారు. పునాదులు ఎత్తుగా వేసుకుని వాటిని పూడ్చడానికి పెద్దఎత్తున సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల 5 అడుగుల వరకు పునాది నిర్మించి దాని లోపలివైపు పూడ్చుకోవాల్సి రావడం లబ్ధిదారులకు భారంగా మారింది. డెల్టా ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కూలీ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇంటి నిర్మాణాన్ని మేస్త్రిలకు ఒప్పందం ఇచ్చి చేయిస్తే ఎక్కువ సొమ్ము అవుతుందని కూలీలను పెట్టుకుని చేయిస్తున్నా అనుకున్న సమయానికి నిర్మాణం చేయలేకపోతున్నామని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. అప్పులు తెచ్చినా సరిపోకపోవడంతో అర్ధంతరంగా ఆపేసినా వారు కొందరున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టినందున ఇక్కడే పని చేయాల్సి రావడంతో రోజువారీ కూలీ పనులకు వెళ్లలేకపోతున్నామని బాపట్లలో జగనన్న కాలనీకి చెందిన మహిళ ఒకరు వాపోయారు. కూలీ పనులకు వెళ్లకపోవడంతో జరుగుబాటు కూడా కష్టంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఇంటి నిర్మాణానికి సొమ్ము ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్లర్లు నిర్మించుకుని ఇంటి నిర్మాణం చేపడితే రూ.5 లక్షలకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదు. నిర్మాణం చేపట్టకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో ఇంటి నిర్మాణం ప్రారంభించామని, చేతిలో సొమ్ము అయిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదని లబ్ధిదారుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని