logo

వెన్ను విరిచిన వాన

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షం కర్షకులను కోలుకోలేని దెబ్బతీసింది. అరటి, మామిడి, జామ పండ్ల తోటలతోపాటు తమలపాకు, మొక్కజొన్న, మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది

Updated : 21 Mar 2023 05:54 IST

అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం వద్ద ఆరబోసిన మిరప కాయలపై కప్పేందుకు పట్టా తీసుకెళ్తున్న రైతులు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షం కర్షకులను కోలుకోలేని దెబ్బతీసింది. అరటి, మామిడి, జామ పండ్ల తోటలతోపాటు తమలపాకు, మొక్కజొన్న, మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది. రోజుల వ్యవధిలో కోతకు సిద్ధమైన అరటి గెలలు నేలవాలడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. కండె దశలో ఉన్న మొక్కజొన్న పంట గాలుల తీవ్రతకు వెన్ను విరిగి కిందపడిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పడిపోవడంతో దిగుబడులపై ప్రభావంతోపాటు కూలీల ఖర్చులు బాగా పెరుగుతాయి. ఏడాది మామిడి చెట్లలో పూత, కాయలు రాలిపోవడంతో అనుకోని నష్టం జరిగింది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నందున కర్షకులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా పంటల నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మిర్చి రైతుల అవస్థలు వర్ణనాతీతం. కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి వడగళ్ల వానకు రాలిపోయింది. కాయలు నాణ్యత దెబ్బతిని తాలుకాయలు అవుతున్నాయి. కోత కోసి కల్లాల్లో అరబెట్టిన మిర్చి మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో పట్టల కింద ఉంచడంతో బూజు పడుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో ఆరుబయట మిర్చి ఎండబెట్టే పరిస్థితి లేక ఏంచేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. రంగు మారిన మిర్చి వివరాలు సైతం సేకరించారు. అయితే ఇప్పటివరకు మిర్చి కోత తర్వాత తడిస్తే నష్ట పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున కల్లాల్లో తడిచిపోయి రంగు మారిన, మిరప మొక్కల్లోనే రంగు మారిన మిర్చిని కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అరటి రైతు  ఆవేదన

దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరికొన్ని రోజుల్లో కోతకు సిద్ధమయ్యే గెలలు గాలుల తీవ్రతకు కింద పడిపోయాయి. అరటి చెట్లు సైతం ఎక్కడికక్కడ విరిగిపోయి నేలవాలాయి. పంట చేతికి వచ్చే దశలో వచ్చిన అకాల వర్షంతో కూడిన గాలులు నిలువునా ముంచేశాయని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి చెట్లు నేలవాలిపోవడంతో పూర్తిగా పనికి రాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. తమలపాకు, కూరగాయల తోటలు గాలులకు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మూడు మండలాల పరిధిలో అరటి 208 హెక్టార్లు, తమలపాటకు తోటలు 4 హెక్టార్లు, కూరగాయల తోటలు 8 ఎకరాల్లో నష్టపోయారు. పల్నాడు జిల్లాలో నకరికల్లు, ఈపూరు, రాజుపాలెం, రొంపిచర్ల, బెల్లంకొండ, మాచవరం, పిడుగురాళ్ల, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అరటి, టమోటా, కాకరకాయ, పొట్లకాయ, మామిడి, బొప్పాయి, మునగ, మిర్చి పంటలు 103.14 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో అరటి 12 ఎకరాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు.

మొక్కజొన్న రైతు  ఆశలు ఆవిరి

మొక్కజొన్న పంట ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. సుడిగాలుల తీవ్రతకు నేలవాలి మొక్కజొన్న విరిగిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న విరిగినా పెద్దగా నష్టం లేదు కానీ కండె దశలో ఉన్న మొక్కజొన్న విరిగి నేలవాలి పోవడంతో సాగుదారుల ఆశలు ఆవిరయ్యాయి. మొక్కజొన్న నేలవాలడంతో కంకులు పాలుపోసుకుని గింజ గట్టిపడే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో నేలవాలిన పంట వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొక్కజొన్నలో అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా యూరియా వాడటం వల్ల పంట ఏపుగా పెరిగింది. ఎత్తుగా పెరిగిన పంట గాలుల తీవ్రతకు నేలవాలింది. గుంటూరు జిల్లాలో 69 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని మండలాల్లో ప్రాథమికంగా 1220 హెక్టార్లలో మొక్కజొన్న, జొన్న 100 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పల్నాడు జిల్లాలో 14వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న సాగు చేయగా 1313 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ లెక్క తేల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలిన నష్టం పరిధిలోకి తీసుకోలేదు. 560 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 11 హెక్టార్లల్లో నువ్వు పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రాజుపాలెం మండలం కోటనెమలిపురి గ్రామంలో పాలుపోసుకునే దశలో ఉన్న వరి పంట తీవ్రంగా దెబ్బతింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని