logo

సాగునీటికి సొమ్ముల గండం

నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల పరిధిలో గత నాలుగేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతు పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి.

Updated : 21 Mar 2023 05:56 IST

నిధులు లేక మరమ్మతులకు నోచుకోని కాల్వలు
సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇదీ సంగతి

ఈనాడు - గుంటూరు

పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆనవాళ్లు కనిపించని అద్దంకి మేజరు కాలువ

నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల పరిధిలో గత నాలుగేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతు పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఒకవైపు నీటితీరువా వసూలుకాకపోవడం, మరోవైపు గతేడాది చేసిన పనులకు బిల్లులు బకాయిలు ఉండటంతో ఈ ఏడాది కాలువల మరమ్మతు ప్రశ్నార్థకంగా మారింది. తాజా బడ్జెట్‌లో కేవలం రూ.2 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఈ సొమ్ము ఇప్పటికే చేసిన పనుల బకాయిలకు సరిపోతుందని, కొత్తగా పనులు చేసే పరిస్థితి లేదని జలవనరులశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈసారి కూడా కాలువలు మరమ్మతు చేయని పక్షంలో ఆయకట్టు చివరి భూములకు సాగునీటి కష్టాలు తప్పవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కనీస నిర్వహణ పనులు కూడా చేయకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కొన్నిచోట్ల కాల్వ కట్టలు కోతకు గురయ్యాయి. కాలువ లోపలి భాగంలోనూ పిచ్చిమొక్కలు, తూటుకాడ, గడ్డి పెరిగిపోయి మైనర్‌ కాలువల్లో నీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు బాగుండటం, జలాశయంలో నీటిలభ్యత పుష్కలంగా ఉండటంతో నీటి కష్టాలు లేకుండా పంటలు గట్టెక్కాయి. ఈ ఏడాదైనా కాలువల మరమ్మతు చేస్తారని రైతులు ఆశిస్తున్నారు.

క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు

నాగార్జునసాగర్‌ కుడి కాలువ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఉన్నాయి. ఎడమ కాలువ పరిధిలో ఎన్టీఆర్‌ జిల్లాలో సాగర్‌ కాలువలు ఉన్నాయి. కుడి, ఎడమ కాలువల కింద 12 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఆయా డివిజన్లలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలు పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేసి జలవనరులశాఖ ముఖ్య ఇంజినీరు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఒక్కొక్క డివిజన్‌ నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు మరమ్మతుకు నిధులు కావాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.15 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది చేసిన పనులకు ఇంకా రూ.5 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. నీటితీరువా కింద వసూలైన సొమ్ము కొంత ఉంది. ఇవి పాత బకాయిలకే సరిపోతే కొత్తగా పనులు చేసే పరిస్థితి లేదు. కడా కూడా రూ.34 కోట్లను కాలువల మరమ్మతుకు బడ్జెట్‌లో కేటాయించారు. ఈ నిధులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాజెక్టుల కింద ఖర్చు చేస్తారు. నీటితీరువా సొమ్ము లభ్యతను అనుసరించి కడా పనులకు అనుమతి మంజూరు చేస్తోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తే కానీ ఈ ఏడాది కాలువలు మరమ్మతు చేసే పరిస్థితి లేదని జలవనరులశాఖ ఇంజినీరు ఒకరు తెలిపారు.

ఇదే కీలక సమయం

నాగార్జున సాగర్‌ కాలువల మరమ్మతు పనులు కాలువల్లో నీటి ప్రవాహం లేనప్పుడు చేయాలి. ప్రస్తుతం కాలువల్లో మార్చి నెలాఖరు వరకు నీటి ప్రవాహం ఉండే అవకాశముంది. ఏప్రిల్‌, మే నెలల్లో కాలువలకు నీటిని కట్టేస్తారు. ఈ కాలం కాలువల మరమ్మతు చేయడానికి అనువైన సమయం. మార్చి నెలాఖరు నాటికి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి ప్రభుత్వానికి పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే ఏప్రిల్‌ తొలి వారంలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తే సకాలంలో పనులు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు ఇప్పటి నుంచి జలవనరులశాఖ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. జూన్‌ నెలలో తాగునీటి అవసరాలకు కోసం కాలువలకు నీటిని విడుదల చేయాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ నెలలోనే పనులు ప్రారంభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మరమ్మతు చేయకపోతే మేజరు, మైనరు కాలువల్లో నీరు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈ విషయమై జలవనరులశాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని