logo

జగన్‌ ఉసిగొల్పడం వల్లే దళిత ఎమ్మెల్యేపై దాడి

నిండు శాసనసభలో సీఎం జగన్‌ ఉసిగొల్పడం వల్లే దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేశారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.

Published : 21 Mar 2023 05:45 IST

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: నిండు శాసనసభలో సీఎం జగన్‌ ఉసిగొల్పడం వల్లే దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేశారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. శాసనసభ చరిత్రలో ఈ విధంగా దాడి ఎప్పుడూ జరగలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో జగన్‌ ఒత్తిడిలో ఉన్నారు. అందుకే దాడి చేయించారు. గతంలో బాల వీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగ నాగార్జున నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు సుధాకర్‌బాబుతో ఏకంగా దాడి చేయించారు. అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై దాడికి సీఎంగా జగన్‌ సిగ్గుపడాలి. వైకాపా పని అయిపోయింది. అందుకే సహనం కోల్పోయి దాడులకు దిగుతున్నారు. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేసిన వారు భవిష్యత్తులో దానికి రెట్టింపు అనుభవిస్తారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’.. అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని