logo

‘రౌడీలను అసెంబ్లీకి పంపితే ఇదే పరిస్థితి’

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

Published : 21 Mar 2023 05:45 IST

మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌, పక్కన రాజా మాస్టారు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. గుంంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నిండు అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం దారుణం. రౌడీలను అసెంబ్లీకి పంపితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సాక్షాత్తు సభాపతి సమక్షంలోనే దాడి జరుగుతున్నా మిన్నకుండిపోయారు. శాసనసభ చరిత్రలో ఎన్నడూ ఈవిధంగా ఎమ్మెల్యేలపై దాడి జరగలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సహనం కోల్పోయి జగన్‌ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై ఈ తరహా దాడులు చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 సీట్లు కాదు.. పదో, పదిహేడో తేల్చే పనిలో ప్రజలు ఉన్నారు. జగన్‌ పరివారాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’.. అని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు మాట్లాడుతూ తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. శాసనసభకు హాజరయ్యే సభ్యులకు బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలి’.. అని డిమాండ్‌ చేశారు. సమావేశంలో తెదేపా నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్‌, బొబ్బిలి రామారావు, రావిపాటి సాయికృష్ణ, షేక్‌ ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని