logo

సిబ్బందిపై రైల్వే అధికారుల వేధింపులు ఆపాలి

రన్నింగ్‌ స్టాఫ్‌ పట్ల రైల్వే బోర్డు, జోనల్‌ అధికారులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టినట్లు గుంటూరు మండల కార్యదర్శి హనుమంతరావు తెలిపారు.

Published : 21 Mar 2023 05:45 IST

నిరాహార దీక్ష చేస్తున్న మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రన్నింగ్‌ స్టాఫ్‌ పట్ల రైల్వే బోర్డు, జోనల్‌ అధికారులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టినట్లు గుంటూరు మండల కార్యదర్శి హనుమంతరావు తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షను సోమవారం ప్రారంభించిన అనంతరం హనుమంతరావు మాట్లాడారు. రన్నింగ్‌ స్టాఫ్‌పై వేధింపులు ఆపాలని పలుసార్లు వినతిపత్రాలను అందజేసినా ఫలితం లేనందునే ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పొదుపు పేరుతో అనేక సదుపాయాలను ఉపసంహరించుకున్న రైల్వే శాఖ, ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వకుండానే ఎక్కువ గంటలు పని చేయాలని ఆదేశాలివ్వడం అన్యాయమన్నారు. సహాయ డివిజనల్‌ కార్యదర్శి మంజునాథ్‌ మాట్లాడుతూ లోకో పైలెట్లపై విపరీతమైన ఒత్తిడి తెచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్న అధికారుల వైఖరికి నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. స్పాడ్‌ నిబంధనలు మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య(ఏఐఆర్‌ఎఫ్‌) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని డివిజన్‌ ప్రధాన కేంద్రాల్లోని క్రూలాబీల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా, గుంటూరులో 24 గంటల నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం గతంలోనూ గుంటూరు నుంచే అనేక ఆందోళన కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టి ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు కృష్ణయ్య, ప్రసాద్‌, కరుణశ్రీ, కేవీఆర్‌కే మూర్తి, తిరుమలరావు, వర్మ, దుర్గారావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని