logo

28, 29 తేదీల్లో దిల్లీలో మహాధర్నా, దీక్షలు

బీసీల కుల గణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దిల్లీలో ఈనెల 28న మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

Published : 21 Mar 2023 05:45 IST

మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు, పక్కన క్రాంతికుమార్‌ తదితరులు

ఏటీ అగ్రహారం, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: బీసీల కుల గణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దిల్లీలో ఈనెల 28న మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరు చుట్టుగుంటలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేపడతామని మాట ఇచ్చి భాజపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నప్పటికి కేంద్రంలో కనీసం చలనం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆందోళనలో దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని, భాజపా మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటరీ నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు మొదలై వారమవుతున్నా అదాని, రాహుల్‌ గాంధీల రాగం తప్ప, బీసీల సమస్యలపై కనీసం చర్చ జరగడంలేదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల శేషయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, సాంస్కృతిక కళామండలి రాష్ట్ర కన్వీనర్‌ ముప్పాన వెంకటేశ్వర్లు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు ద్వారకా శ్రీను, నాయకులు వెంకట్రావు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని