logo

పరమాన్నంతోనే పండగ

మన తొలి పండగ ఉగాదిని కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకుని సందడిగా జరుపుకుంటారు.

Updated : 22 Mar 2023 06:08 IST

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు
 సామాన్యుల లోగిళ్లలో ఉగాది సందడి అంతంతే

ఈనాడు-నరసరావుపేట, బాపట్ల : మన తొలి పండగ ఉగాదిని కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకుని సందడిగా జరుపుకుంటారు. అయితే గ్యాస్‌ నుంచి కిరాణా సరకుల ధరలు పెరగడం, సామాన్యులకు ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో పండగ వేళ అన్ని వంటలు చేసుకోలేని పరిస్థితి. ఉగాది పచ్చడి ప్రసాదంతో ప్రారంభమై గారెలు, పూర్ణాలు, బొబ్బట్లు, పరమాన్నం, పప్పన్నం.. ఇలా పలు వంటకాలతో చేసుకునే పండగను కొన్ని వంటలకే పరిమితం అవుతున్నారు. వంట నూనెలు, నెయ్యి ధరలు పెరగడం, మినపగుళ్లు, కందిపప్పు, పెసరపప్పు, యాలకులు, జీడిపప్పు ధరలు పెరగడంతో అన్ని పిండి వంటలు చేసుకుని ఆస్వాదించలేకపోతున్నారు. మరోవైపు గత మూడు రోజులుగా కురిసిన అకాలవర్షాలతో పంటలు దెబ్బతిని కర్షకులు కుదేలయ్యారు. రైతులు, రైతుకూలీలు పొలాలు, కల్లాల్లోనే గడుపున్నారు. నగరాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంతోపాటు పలు రంగాల్లో ఆశించిన మేర ప్రగతి లేక కూలీలకు ఉపాధి కరవైంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆదాయాలు తగ్గిపోయి ఉన్నదాంట్లో సర్దుకునే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. దీంతో అన్ని రంగాల వారు పూర్తిస్థాయిలో పండగ చేసుకోలేని పరిస్థితి. ఉగాది పండగ రోజు పరమాన్నంతోనే సరిపెట్టుకుంటున్నామని సాధారణ కుటుంబీకులు నిట్టూరుస్తున్నారు.

ధరల దడ..

ఉగాది పండగకు ప్రధానంగా గారెలు వండుకుంటారు. అయితే నెల రోజుల వ్యవధిలో మినపప్పు కిలో రూ.105 నుంచి రూ.110కు ధర పెరిగింది. పెసరపప్పు కిలో రూ.110 నుంచి రూ.117కు, కందిపప్పు రూ.115 నుంచి రూ.125కు ధరలు పెరిగాయి. అన్ని వంటల్లో వాడే సుగంధ ద్రవ్యమైన యాలక్కులు జనవరిలో కిలో రూ.1600 ఉండగా, ప్రస్తుతం రూ.1800కు పెరిగింది. నాణ్యమైన నెయ్యి కిలో రూ.530 నుంచి రూ.630కు పెరిగింది. పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.100, శనగనూనె రూ.170 ధర పలుకుతున్నాయి. ఉగాది పండగకు వండే పిండి వంటలకు అవసరమైన అన్ని రకాల కిరాణా ధరలు పెరగడంతో సామాన్యులు ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. చేతిలో సొమ్ము చూసుకుని ఒక్కొక్కటిగా ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. తాడికొండ మండలం నుంచి గుంటూరు నగరానికి రోజువారీ కూలీకి వచ్చే నారాయణ కొన్నాళ్లుగా సక్రమంగా పనులు దొరకకపోవడంతో పండగకు నూతన వస్త్రాలు కొనుగోలు చేయలేకపోయానని, పండగ కూడా ఏదోలా కానిచ్చేస్తున్నామని వాపోయారు. బియ్యం, బెల్లం, పాలుతో తయారయ్యే పరమాన్నం వండుకుంటే తక్కువ ఖర్చుతో పండగ అయిపోతుందంటున్నారు. రోజువారీ పనులు దొరికితే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కిరాణా, ఇతర సరకుల ధరలు కొంతమేర పెరిగినప్పటికీ ఆదాయం లేకపోవడం వల్ల ఎక్కువ మంది పండగ జరుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ధరలు కొంతమేర పెరిగినా ప్రభావం ఎక్కువగా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు సరకులు కొనుగోలు చేస్తున్నారని, గతంలో వలె పండగకు ప్రత్యేకంగా కొనుగోలుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు. అట్టడగు వర్గాల నుంచి మధ్య తరగతి వర్గాల వారికి ఆదాయం తగ్గిన ప్రభావం అన్ని వ్యాపారాలపై పడిందని గుంటూరుకు చెందిన వ్యాపారి ఒకరు విశ్లేషించారు. వ్యాపార కూడలిగా ఉన్న పట్నంబజారులో పండగ వేళ ఉండాల్సిన సందడి లేదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని