logo

నగదు జమ చేయకుంటే విధుల బహిష్కరణ

తమ వ్యక్తిగత ఖాతాల నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు ఉపసంహరించిన రేషన్‌ బియ్యం సరఫరా వాహనాల బీమా సొమ్మును తిరిగి చెల్లించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి విధులను బహిష్కరిస్తామని రేషన్‌ పంపిణీ వాహనదారులు తేల్చి చెప్పారు.

Updated : 22 Mar 2023 06:09 IST

రేషన్‌ పంపిణీ  వాహనదారుల హెచ్చరిక

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రేషన్‌ పంపిణీ వాహనదారులు

కొల్లూరు, న్యూస్‌టుడే: తమ వ్యక్తిగత ఖాతాల నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు ఉపసంహరించిన రేషన్‌ బియ్యం సరఫరా వాహనాల బీమా సొమ్మును తిరిగి చెల్లించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి విధులను బహిష్కరిస్తామని రేషన్‌ పంపిణీ వాహనదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు తాము ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ శ్రీనివాసరావుకు అందజేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తమకు రేషన్‌ బియ్యం, ఇతర సరకుల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం అందజేసిన వాహనాల బీమాను నిబంధనల ప్రకారం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నా, సంబంధిత బ్యాంకు  అధికారులు బీమా పేరుతో రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకూ అక్రమంగా తమ వ్యక్తి గత ఖాతాల నుంచి జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై తమ శాఖ అధికారులు లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చినా బ్యాంకు అధికారులు స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. వివిధ కారణాలతో ఇటీవల 57 మంది రేషన్‌ పంపిణీ వాహనదారులు మృతి చెందారని వారికి బీమా వర్తింపచేయలేదని వీరిలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతి చెందిన వారుసైతం ఉన్నారని పేర్కొన్నారు. తమ వేతనాలను రెండేళ్లుగా నిలిపివేయడంతో పాటు ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న విధానాలు తమను అప్పుల పాల్జేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తమ వాహనాల ద్వారా చేసిన సరఫరాలకు సంబంధించి ఐదు నెలల నుంచి కమీషన్‌ సొమ్మును సైతం తమకు అందజేయలేదని వారు వాపోయారు. తమ సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించకపోతే విధులు బహష్కరిస్తామని వినతిపత్రంలో స్పష్టం చేశామని వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని