logo

స్వచ్ఛ సంకల్పంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా పంచాయతీల సర్పంచులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు.

Published : 22 Mar 2023 05:26 IST

మాట్లాడుతున్న జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా పంచాయతీల సర్పంచులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. జడ్పీలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, ఐటీసీ, సెర్చ్‌, ఫినిష్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం అమలు, పారిశుద్ధ్యం మెరుగుగా నిర్వహించడంలో కృషి చేసిన ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందికి జగనన్న స్వచ్ఛ సంకల్పం పురస్కారాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన చేయకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని తెలిపారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే ప్రజల జీవన ప్రమణాలు పెరుగుతాయన్నారు. అధ్యక్షత వహించిన జడ్పీ సీఈవో మోహన్‌రావు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 8 పనులకు మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేయడానికి సర్పంచులు, వార్డు సభ్యులు ముందుకు రావాలని కోరారు. ఐటీసీ అనుబంధ సెర్చ్‌, ఫినిష్‌ సంస్థల రాష్ట్ర మేనేజరు గౌరీనాయుడు, ఐటీసీ ప్రోగ్రాం అధికారి సురేష్‌ మాట్లాడుతూ ప్రజలు మంచి వాతావరణంలో జీవించేలా చూసేందుకు ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉత్తమ సేవలు అందజేసిన అధికారులు, ఉద్యోగులను సన్మానిస్తున్నామన్నారు. అనంతరం జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా పురస్కారాలకు ఎంపికైన ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ధ్రువపత్రాలు అందజేశారు. సమావేశంలో జడ్పీ ఉపాధ్యక్షరాలు బత్తుల అనురాధ, డీపీఆర్‌సీ సమన్వయకర్త పి.ఎస్‌.పద్మాకర్‌, జడ్పీ ఇన్‌ఛార్జి ఏవో జి.శ్రీనివాసరావు, సెర్చ్‌ సంస్థ కార్యదర్శి సీహెచ్‌.పార్థసారథి, ఫినిష్‌ సంస్థ ప్రోగ్రాం మేనేజరు ఖాజావలి, ఉద్యోగులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని