logo

‘ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’

శాసనసభలో తెదేపా దళిత ఎమ్మెల్యేపై వైకాపా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

Published : 22 Mar 2023 05:26 IST

మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పక్కన పిల్లి మాణిక్యరావు తదితరులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: శాసనసభలో తెదేపా దళిత ఎమ్మెల్యేపై వైకాపా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను, ప్రభుత్వం చేసే తప్పుడు పనుల్ని ప్రస్తావించడం ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుల బాధ్యత. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఓర్చుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం జగన్‌ దళిత ఎమ్మెల్యేపై దాడికి వైకాపా ఎమ్మెల్యేలను ఉసిగొల్పారు. బాలవీరాంజనేయ స్వామిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబు చేయని అవినీతిని చేశారని ప్రజల్ని నమ్మించేందుకు జగన్‌ ఇప్పటి వరకు స్కిల్‌ డవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ఎనిమిది సార్లు సమీక్షలు చేశారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌.. అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి జరిగితే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం పెట్టుబడి పెట్టిన సీమెన్స్‌ సంస్థను ఎందుకు విచారించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ప్రాజెక్టు కోసం 10 శాతం నిధులు మాత్రమే విడుదల చేసిన ఐఏఎస్‌ ప్రేమచంద్రారెడ్డిని సీఐడీ ఎందుకు విచారించదు. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోకుండా సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు’.. అని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేపై జరిగిన దాడిలో స్పీకర్‌ను రీకాల్‌ చేయాలన్నారు. స్పీకర్‌ పోడియం వద్ద అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుందో తేల్చాలన్నారు. ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేస్తుంటే వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేస్తారా.. అని ప్రశ్నించారు. సమావేశంలో తెదేపా నాయకులు చిట్టాబత్తిన చిట్టిబాబు, మద్దిరాల మ్యాని, మన్నవ వంశీకృష్ణ, వేములకొండ శ్రీనివాస్‌, వేములపల్లి శ్రీరాంప్రసాద్‌, హుస్సేన్‌, లింగారావు, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని