logo

శోభాయమానం.. సాహితీ వసంతోత్సవం

సంగీత, సాహిత్య, చిత్రలేఖన, నటనాలంకృతంగా సాగిన సభ సరస ఛలోక్తుల సుమగంధాలతో గుబాళించింది. శోభకృత్‌ ఉగాది నాడు కవులు, గాయకులు కోయిలలై కవితా రసగానంతో ప్రేక్షకులను పులకింపజేశారు.

Published : 23 Mar 2023 05:12 IST

శ్రీనివాసాచార్యకు సాహితీ సమాఖ్య పురస్కారం అందజేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు,

చిత్రంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, నాగఫణిశర్మ, డాక్టర్‌ గురువారెడ్డి, గజల్‌ శ్రీనివాస్‌ తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సంగీత, సాహిత్య, చిత్రలేఖన, నటనాలంకృతంగా సాగిన సభ సరస ఛలోక్తుల సుమగంధాలతో గుబాళించింది. శోభకృత్‌ ఉగాది నాడు కవులు, గాయకులు కోయిలలై కవితా రసగానంతో ప్రేక్షకులను పులకింపజేశారు. చిత్ర లేఖకుని కుంచె.. గాయని కంఠస్వరానికి పులకిస్తూ కదిలి చిత్రాన్ని ఆవిష్కరించింది. ఆశు కవితా ధారలు సాహిత్యామృత ధారలయ్యాయి. తెలుగు గజల్స్‌ కవన మమూరాలై నర్తించాయి. మొత్తంగా సాహితీ వసంతోత్సవం మధుమాస మధురిమలను పంచింది. శోభకృత్‌ స్వాగత వేళ ఈ సంప్రదాయ కవితా హేల గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం రాత్రి పల్లవించింది. గుంటూరు సాహితీ సమాఖ్య 26వ సాహితీ వసంతోత్సవ సంరంభ సభలో కవులు, కళాకారులు, పాలనాధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. నాదస్వర కచేరీ, వేదస్వస్తి, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలన్నీ అచ్చ తెలుగు వాతావరణం శోభిల్లుతూ కనిపించిన వేదికపై కదలాడుతూ కన్నార్పనివ్వలేదు. గుదిమెళ్ల కూర్మనాథ స్వామి పంచాంగ పఠనం చేశారు.

ఆత్మీయ పురస్కారం అందుకుంటున్న  బీఎస్‌ శర్మ, రేటూరి గాయత్రి

సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ డీవీఎస్‌బీ రామ్మూర్తి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. జానపద సాహిత్య పరిశోధకుడు భాస్కరయోగి జానపద సాహిత్యం, వైదిక సాహిత్యంలోని అంశాలను వివరించిన తీరును పాటలు పాడి వినిపించారు. సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్‌ ఎస్‌.వి.గురవారెడ్డి తెలుగు సాహిత్యంలో హాస్యరస సన్నివేశాల గురించి చెపుతూ మునిమాణిక్యం, భమిడిపాటి, విశ్వనాథ, చిలకమర్తి, పానుగంటి తదితరుల రచనల్లోని హాస్య సన్నివేశాలను ఉదహరిస్తూ తన స్వానుభవ సన్నివేశాలను, గుంటూరుతో తన అనుబంధాన్ని హాస్యస్ఫోరకంగా వివరించారు. అనంతరం సుప్రసిద్ధ చిత్రకారుడు కూచి.. ‘ఈటీవీ పాడుతా తీయగా’ విజేత రేటూరి గాయత్రి పాడిన స్వాగతం కృష్ణా, హైలో హైలెస్సా పాటలను పాడుతున్న సమయంలోనే ఆయా పాటల సారాన్ని వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించి ఆశ్చర్యపర్చారు. బృహత్‌ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ తనదైన శైలిలో పరవళ్లు తొక్కే ఆశు పద్య ధారతో గజల్‌ శ్రీనివాస్‌ ప్రత్యేకంగా ఉగాది పండగ కోసం రాసిన గజల్స్‌తో పాటు మరికొన్నిటినీ పాడి పరవశింపజేశారు. ఈ సందర్భంగా శోభకృత్‌ ఉగాది పురస్కారాన్ని దర్భశయనం శ్రీనివాసాచార్యకు, ఆత్మీయ పురస్కారాన్ని బీఎస్‌ శర్మకు ఇచ్చి సత్కరించారు. అతిథులుగా జిల్లా పాలనాధికారి వేణుగోపాలరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎన్‌ఎస్‌ సోమయాజులు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్‌ లక్ష్మీనారాయణ పురస్కార ప్రదానంలో పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు తమ కవితలను వినిపించారు. రాత్రి పది గంటలు దాటే వరకు సభ సాహితీ సేద్యం చేస్తూనే ఉంది.

గాత్రానికి అనుగుణంగా చిత్రం గీస్తున్న కూచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని