logo

భక్తి.. ప్రేమ.. త్యాగం..సమ్మిళితమే రంజాన్‌

నిర్వహించే అతి పెద్ద పండగ, పవిత్ర రంజాన్‌ మాస శుభగడియలు సమీపించాయి. నెలవంక దర్శనంతో రంజాన్‌ నెల ప్రారంభం కానుంది.

Published : 23 Mar 2023 05:12 IST

పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు
మసీదులకు విద్యుత్తు దీపాల అలంకరణ
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

ప్రత్యేక వెలుగుల్లో తెనాలి జామియా మసీదు మినార్‌లు

నిర్వహించే అతి పెద్ద పండగ, పవిత్ర రంజాన్‌ మాస శుభగడియలు సమీపించాయి. నెలవంక దర్శనంతో రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు మసీదులు విద్యుత్తు వెలుగులతో మెరిసిపోతున్నాయి. సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్‌ మానవాళికి దివ్య ఖుర్‌ఆన్‌ అందించిన నెలే రంజాన్‌.

ప్రాథమిక విధుల్లో ప్రాధాన్యం

ప్రతి ముస్లిం 5 ప్రాథమిక విధుల ద్వారా ఇస్లాంలో ముందుకు పయనిస్తారు. కలిమా చదవడం, ప్రతిరోజూ 5 సార్లు నమాజ్‌ చేయటం, రంజాన్‌ నెలలో ఉపవాసం, తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయటం(జకాత్‌), హజ్‌ చేయటం ఈ విధులు. వీటిల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉపవాసాల నెలే రంజాన్‌. నెల రోజుల ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందన్నది వారి విశ్వాసం.

ఉపవాసం అందరి విధి

పవిత్ర ఖుర్‌ఆన్‌ ప్రకారం ప్రతి ముస్లిం రంజాన్‌ నెలలో ఉపవాసం ఉండటం విధి. ప్రాపంచిక విషయాలపై అవగాహన కలిగిన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని తప్పనిసరిగా పాటించాలి. అనారోగ్యంతో బాధపడేవారు, బాలింతలు, నెలసరిలో ఉన్న మహిళలు, గర్భిణులకు మినహాయింపు ఉంది. అయితే వారు కూడా తమ, తమ సమస్యలు తీరిన తర్వాత ఖజా ఉపవాసాలు ఉండాలి.

ఆధ్యాత్మిక జీవన విధానంపై శిక్షణ

ఉపవాసం సందర్భంగా శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచుకుని ఉదయం సూర్యోదయం లోపల, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం ప్రదాన విషయం. ఉపవాసం ఆచరిస్తున్న సమయంలో అసత్యం పలకరాదు, అధర్మంగా ప్రవర్తించరాదు. దైవంపై ప్రేమ అధికమవుతుంది. తదుపరి జవితానికి ఈ నెల ఒక ‘శిక్షణ’గా ఉపయోగపడుతుంది. రంజాన్‌ నెల ప్రధాన ధ్యేయం ఇదే.

జకాత్‌, ఫిత్రా తప్పనిసరి

దానం చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం తన మిగులు సంపాదనలో కొంత పేదవారికి పంచిపెట్టడమే జకాత్‌. ధన వ్యామోహాన్ని దూరం చేయడం, పేద వారు కూడా పండగను సంతోషంగా చేసుకోవటానికే అల్లాహ్‌ జకాత్‌ను తప్పనిసరి చేశారు. ఇది ఏటా కొనసాగాలి. అదే విధంగా అప్పుడే పుట్టిన బిడ్డతో సహా అందరూ ఫిత్రాను పేదవారికి ఇవ్వాలి.

ఎతికాఫ్‌

రంజాన్‌ నెలలో మరో పవిత్ర అంశం ఎతికాఫ్‌. ఈ నెలలో చివరి పది రోజులు కుటుంబాన్ని తాత్కాలికంగా వదిలి మసీదుల్లో దైవ ప్రార్థనలతో గడపటమే ఎతికాఫ్‌. అతి పవిత్రమైన లైలతుల్‌ఖద్ర్‌ ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసంలోని 27వ రోజు రాత్రిని పుణ్యరాత్రిగా పరిగణిస్తారు. ఆ రాత్రి జాగారం ఉండి, దైవ ప్రార్థనలో గడుపుతారు. నెల రోజుల పాటు చదివిన ఖుర్‌ఆన్‌ చివరి అంకాన్ని ఈ రాత్రి ముగిస్తారు. అల్లాహ్‌ కృప కోసం ప్రత్యేకంగా దువా చేస్తారు.

ఈ ఏడాది మార్చి 23న రంజాన్‌ నెల వంక దర్శనం ఇస్తే అదే రోజు రాత్రి ప్రత్యేక తరావీ నమాజ్‌లు మొదలవుతాయని, శుక్రవారం తొలి ఉపవాసం అవుతుందని తెనాలికి చెందిన ముఫ్తీ అల్లాఉద్దీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని