logo

మిల్లెట్స్‌ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

చిరు ధాన్యాల (మిల్లెట్స్‌) పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిస్తున్నట్లు ఐకార్‌- భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) హైదరాబాద్‌ సంచాలకురాలు డాక్టర్‌ సి.తార సత్యవతి అన్నారు.

Published : 25 Mar 2023 05:07 IST

మాట్లాడుతున్న   డాక్టర్‌ తార సత్యవతి

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: చిరు ధాన్యాల (మిల్లెట్స్‌) పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిస్తున్నట్లు ఐకార్‌- భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) హైదరాబాద్‌ సంచాలకురాలు డాక్టర్‌ సి.తార సత్యవతి అన్నారు. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ), సామాజిక విజ్ఞాన కళాశాల లాం, ఐఐఎంఆర్‌ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ‘మిల్లెట్స్‌- మహిళలు’ అనే అంశంపై సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆంగ్రూ ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్థన్‌రెడ్డితో కలిసి తార సత్యవతి జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించి మాట్లాడారు. నూతన ఆలోచనలతో చిరు ధాన్యాల యూనిట్లను ప్రారంభించడానికి న్యూట్రి హబ్‌లో నమోదు చేసుకున్న 400 స్టార్టప్‌లకు ఐఐఎంఆర్‌ ప్రోత్సహించి నిధులు కేటాయించిందన్నారు. మహిళలతో పాటు ఇతరులు మిల్లెట్స్‌ సూక్ష్మ, లఘు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే వారికి శిక్షణ ఇచ్చి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందేలా చూస్తామన్నారు. కార్పొరేట్‌ సంస్థలు కూడా చిరు ధాన్యాల పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చి ఐఐఎంఆర్‌ వద్ద పేర్లు నమోదు చేసుకున్నాయని తెలిపారు. మిల్లెట్స్‌ ఆహారంలో తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని, తూచా తప్పకుండా మందులు మాత్రం వేసుకుంటున్నారన్నారు. మహిళలు సగటున రోజుకు 90 గ్రాముల చిరు ధాన్యాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో ఉంటారన్నారు. ఆంగ్రూ పరిశోధన సంచాలకురాలు ఎల్‌.ప్రశాంతి మాట్లాడుతూ సామాజిక విజ్ఞాన కళాశాల, ఆంగ్రూ కళాశాలల వసతి గృహాల్లో రాగి జావ, చిరు ధాన్యాల ఆహార పదార్థాలను మెనూలో చేర్చాలని సూచించారు. చిరు ధాన్యాల వంటలతో ఉపయోగాలపై రూపొందించిన ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని