logo

నాలుగేళ్లుగా నీటి సమస్య!

 నీటి సమస్యపై స్వయంగా ఆస్పత్రి సందర్శనకు వచ్చి కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తప్పుబట్టారు. మంత్రి దృష్టికి నీటి సమస్య వెళ్లడం, ఆమె రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సమస్యపై గట్టిగా ప్రశ్నించడంతో సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని  చెప్పారు.

Updated : 28 Mar 2023 06:46 IST

ట్యాంకర్ల ద్వారా చాలీచాలని సరఫరా
ఎయిమ్స్‌లో వైద్య సేవలకు అంతరాయం
పనులు పూర్తయితేనే శాశ్వత పరిష్కారం

ఈనాడు, అమరావతి

గుంటూరు- విజయవాడ మధ్య మంగళగిరి పరిసరాల్లో పచ్చని కొండల నడుమ ఏర్పాటైన ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది. ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన నీటి సరఫరా ఇప్పటికీ అందడం లేదు. దీంతో అన్ని వైద్య విభాగాల్లో ఇన్‌, ఔట్‌ పేషెంట్‌ సేవలు ప్రారంభం కాలేదు. పరిమిత విభాగాల్లో మాత్రమే రోగులకు ఇన్‌పేషెంట్‌ వైద్యం అందుతోంది. చాలా వరకు పొరుగు సేవలతో సరిపుచ్చుతున్నారు. దీనికి కారణం నీళ్లు లేకపోవడమేనని స్పష్టమవుతోంది. దీనికి దగ్గరలోనే ఒకవైపు ప్రకాశం బ్యారేజీ, మరోవైపు గుంటూరు ఛానల్‌ ఉన్నాయి. నీటి వనరుల పరంగా ఇబ్బంది లేదు. కానీ యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించటం తదితర కారణాలతో ఆ సమస్యను పరిష్కరించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఎయిమ్స్‌ అందుబాటులోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఇంకా నీటి సమస్యతో సతమతం కావడం గమనార్హం.

గుంటూరు ఛానల్‌  నుంచి..

గుంటూరు ఛానల్‌ నుంచి ఆత్మకూరు చెరువుకు నీళ్లు మళ్లించి అక్కడి నుంచి 5 కి.మీ పైగా దూరంలో ఉన్న ఆస్పత్రికి పైపులైన్ల ద్వారా నీళ్లు అందించడానికి సుమారు రూ.8 కోట్లతో గతేడాది డిసెంబరులో ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం పనులు ప్రారంభించింది. 2.5 ఎంల్‌డీ సామర్థ్యంతో కూడిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, నీటి నిల్వకు సంపులు ఏర్పాటు వంటివి అందులో ఉన్నాయి. ఇప్పటి వరకు పైపులైన్ల నిర్మాణ పనులే పూర్తి కాలేదు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు, సంపుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఈ పనుల పూర్తికి ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరచూ ఈ పనులపై సీఎస్‌ స్థాయిలో సమీక్ష జరుగుతోంది. పనులు మాత్రం ఇంకా వేగం పుంజుకోలేదు. ప్రస్తుతం ఆస్పత్రి అవసరాలకు విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా 6లక్షల లీటర్లు చేరవేస్తున్నారు. తాడేపల్లిలోని పవర్‌బోర్ల ద్వారా మరో లక్ష లీటర్ల నీళ్లు అందిస్తున్నామని యంత్రాంగం చెబుతున్నా ఆ మేరకు ఆసుపత్రికి రావటం లేదని తెలిసింది. ఆసుపత్రి అవసరాలకు సగటున 8 నుంచి 10 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుతం యంత్రాంగం చెబుతున్న లెక్కల ప్రకారం ఏడు లక్షల లీటర్ల నీళ్లే పంపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి నీటి కొరత ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి రావడానికి నీళ్లు అవసరం. ఎయిమ్స్‌ బలోపేతమైతే గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలపై రద్దీ తగ్గుతుంది. తద్వారా ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడానికి వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎయిమ్స్‌ రాకతో జీజీహెచ్‌పై రద్దీ తగ్గుతుందని భావించామని, కానీ ఆ పరిస్థితి లేదని జీజీహెచ్‌ వైద్యులు అంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని త్వరితగతిన ఎయిమ్స్‌లో నీటి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

నిష్ణాతులైన  వైద్య బృందం ఉందని..

రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కేటాయించింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రూపుదిద్దుకుంది. అత్యాధునిక హంగులతో ఆస్పత్రి ఏర్పాటైంది. ఆస్పత్రి నిర్వహణకు అసరమైన నీళ్లు, రహదారులు వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. గుంటూరు, విజయవాడ రెండు ప్రధాన నగరాల మధ్య ఇది ఉండటం.. నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్యర్యంలో ఇక్కడ వైద్యసేవలు లభ్యమవుతున్నాయని తెలుసుకుని అటు విజయవాడ ఇటు గుంటూరు పరిసరాల నుంచి రోగులు పోటెత్తుతున్నారు. రోగుల నుంచి మంచి ఆదరణ ఉంది. కానీ ఆస్పత్రికి చేరుకున్న రోగులకు గుక్కెడు నీళ్లు లభ్యం కాని దుస్థితి నెలకొంది. సగటున రోజుకు 700 నుంచి వెయ్యి మంది వరకు ఓపీకి వస్తున్నారు. అత్యవసర శస్త్రచికిత్సలైతే తప్ప ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవడం లేదు. సాధ్యమైనంత వరకు పొరుగు సేవలతోనే సరిపుచ్చుతున్నారు. సరిపడా నీళ్లు ఉంటే ఐపీ, ఓపీ అన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి తమకు ఇబ్బందేమీ లేదని వైద్యులు అంటున్నారు.


 నీటి సమస్యపై స్వయంగా ఆస్పత్రి సందర్శనకు వచ్చి కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తప్పుబట్టారు. మంత్రి దృష్టికి నీటి సమస్య వెళ్లడం, ఆమె రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సమస్యపై గట్టిగా ప్రశ్నించడంతో సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని  చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని