logo

వైకాపా నేతల ఇసుక యుద్ధం

ఇసుక తవ్వకం అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అసైన్డ్‌ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీగా తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు.

Published : 28 Mar 2023 05:48 IST

అక్రమ తవ్వకాలపై జేసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ

బాపట్ల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలతో  గోతులు ఇలా..

ఇసుక తవ్వకం అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అసైన్డ్‌ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీగా తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మూడేళ్లుగా బినామీల ద్వారా యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తూ విక్రయాల ద్వారా రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఈ క్రమంలోనే అమాత్యుడి కన్ను ఇసుకపై పడింది. ఆయన అనుచరులు రంగప్రవేశం చేశారు. బాపట్ల-చీరాల మండలాల సరిహద్దుల్లో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారు. బాపట్ల పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి మెరక వేయటానికి అవసరమైన బుసక సరఫరాకు ఎమ్మెల్యే వర్గీయులతో పాటు మంత్రి వర్గీయులు పోటీ పడుతున్నారు. జేసీబీలతో తవ్విన ఇసుకను లారీల్లో బయటకు తరలించటానికి అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్సీ పొలాల నుంచి దారి వేసుకుంటామని నేరుగా ఆయనకే అమాత్యుని వర్గీయులు చెప్పారు. అక్రమ తవ్వకాలపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి తరఫున సదరు ఎమ్మెల్సీ జేసీ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు.
నీ నిర్మాణ రంగంలో ఇసుక, బుసకకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. బాపట్ల, చీరాల మండలంలోని అసైన్డ్‌ భూములను వైకాపా ఎమ్మెల్యే తన బినామీ ద్వారా కొనుగోలు చేశారు. 216ఏ జాతీయ రహదారి, విజయవాడ- చెన్నై రైల్వేలైన్‌ మూడో ట్రాక్‌ నిర్మాణానికి అంటూ బుసక తవ్వకానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఐదడుగులకు మించి తవ్వరాదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ 25 అడుగులకు పైగా బుసక, ఇసుక తవ్వి రోజూ వందల ట్రిప్పులు విక్రయించి రూ.కోట్లు గడించారు. భూమిలో పై నాలుగు అడుగులు బుసక ఆ తర్వాత తవ్వితే ఇసుక వస్తున్నాయి. ప్రస్తుతం టిప్పర్‌ బుసుకకు రూ.10 నుంచి 12 వేలు, ఇసుకకు రూ.15 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

* బాపట్ల మండలం పడమర బాపట్ల, వెదుళ్లపల్లి, స్టూవర్టుపురం, చీరాల మండలం దేవినూతల, కావూరివారిపాలెం, బోయినవారిపాలెంలోని అసైన్డ్‌ భూముల్లో అక్రమ దందా కొనసాగుతోంది. ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం చుట్టూ కూరగాయలు, పూలతోటలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అర ఎకరా, ఎకరా భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు పంటలు కోల్పోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పట్టణ శివారున రూ.510 కోట్లతో వైద్య కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు. కళాశాలకు చెరువు భూములు కేటాయించారు. ఈ నేపథ్యంలో మెరక వేయటానికి బుసక అవసరమైంది. ఓ ఎమ్మెల్యే తన బినామీ ద్వారా బుసక సరఫరా చేస్తున్నారు. తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్సీకి చెందిన పంట భూములున్నాయి. అక్రమ తవ్వకాల వల్ల తన పంట భూములు దెబ్బతింటున్నాయని, ఇతర రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యేకు నేరుగా ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలతో తనకు సంబంధం లేదని జాతీయ రహదారి విస్తరణ పనుల గుత్తేదారు తవ్వుతున్నారని సదరు ఎమ్మెల్యే చెప్పినట్లు తెలిసింది.

అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి..

ఇసుక తవ్వకాలు, విక్రయాల ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్న విషయం తెలిసి ఇటీవల ఓ మంత్రి తన అనుచరులను బాపట్ల, చీరాల మండలాలకు పంపించారు. తెనాలి నుంచి వచ్చిన అనుచరులు 12ఎకరాల అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారు. టిప్పర్లలో ఇసుక తరలించటానికి తాత్కాలికంగా రహదారి వేశారు. వైద్య కళాశాల నిర్మాణానికి మెరక పనులకు తాము బుసక సరఫరా చేస్తామని వచ్చారు. ఎమ్మెల్సీకి ఫోన్‌ చేసి మమ్నల్ని మంత్రి పంపించారని చెప్పారు. తాము ఇసుక తవ్విన ప్రాంతం నుంచి వాహనాల్లో తరలించటానికి మీ భూముల నుంచి రోడ్డు వేస్తామన్నారు. రోడ్డు ప్రతిపాదనపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాపట్ల, చీరాల మండలాల రైతులు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో అక్రమ తవ్వకాలు, బుసక, ఇసుక రవాణాపై ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తన వ్యవసాయ భూముల చుట్టూ మాత్రమే తవ్వారని, ఇక నుంచి నేరుగా ఆ భూముల నుంచే రోడ్డు వేసి ఇసుక తరలిస్తామని అమాత్యుని అనుచరులు నేరుగా ఫోన్‌ చేసి చెప్పటంతో ఆ ఎమ్మెల్సీకి కోపం వచ్చింది. కలెక్టరేట్‌కు వెళ్లి జేసీ శ్రీనివాసులును కలిసి పరిస్థితి వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించి తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేయించారు. ఇసుక, బుసక తవ్వకాల విషయంలో అమాత్యుడు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని