logo

‘ప్రాంతీయ ఆసుపత్రికి వైకాపా రంగులు దుర్మార్గం’

హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జిల్లా కేంద్రం బాపట్లలో ప్రాంతీయ ఆసుపత్రికి వైకాపా రంగులు వేయటం దుర్మార్గమని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ ధ్వజమెత్తారు.

Updated : 28 Mar 2023 06:42 IST

నిరసన తెలుపుతున్న నరేంద్రవర్మ, పార్టీ నేతలు

బాపట్ల, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జిల్లా కేంద్రం బాపట్లలో ప్రాంతీయ ఆసుపత్రికి వైకాపా రంగులు వేయటం దుర్మార్గమని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ ధ్వజమెత్తారు. ఆధునికీకరణ పనుల పేరుతో ప్రాంతీయ ఆసుపత్రికి వైకాపా రంగులు వేశారంటూ తెదేపా నేతలతో కలిసి ఆసుపత్రి వద్ద సోమవారం ధర్నా చేసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే కోన రఘుపతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైద్యశాలలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదన్నారు. పేద గర్భిణులకు సురక్షిత ప్రసవాలు చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ కనీస వైద్య సదుపాయాలు లేకుండా పోయాయన్నారు. ఐసీయూ వైద్య సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు పరిపాలన చేయటం చేతకాక ప్రజా ధనంతో అధికార వైకాపా రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. హైకోర్టులో పిటిషన్‌ వేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. బాపట్ల వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి రెండేళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. వైద్యశాల నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను తెదేపా నేతలతో వేగేశన కలిసి భవనాలకు వేసిన వైకాపా రంగులను తక్షణమే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తెదేపా నేతలు విజేత, శ్రీనివాసరావు, శరత్‌, సరోజిని, ప్రమీలారాణి, వెంకట్రావు, విజయ్‌, ఆంద్రేయ, రామసుబ్బారావు, నాగేశ్వరరావు, రామారావు, భావనారాయణ,  అశోక్‌, ఏడుకొండలు, దుర్గాప్రసాద్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు