logo

వ్యవసాయశాఖ సహాయ సంచాలకులకు తాఖీదు

వ్యవసాయశాఖలో గుంటూరు సహాయ సంచాలకులు జి.శ్రీనివాసరావుకు వ్యవసాయశాఖ కమిషనర్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సదరు ఏడీఏ పరిధిలో పనిచేసే వ్యవసాయాధికారుల డిప్యూటేషన్‌ గడువు ముగియడంతో వారిని కొనసాగిస్తూ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు.

Published : 28 Mar 2023 05:57 IST

ఈనాడు, అమరావతి

వ్యవసాయశాఖలో గుంటూరు సహాయ సంచాలకులు జి.శ్రీనివాసరావుకు వ్యవసాయశాఖ కమిషనర్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సదరు ఏడీఏ పరిధిలో పనిచేసే వ్యవసాయాధికారుల డిప్యూటేషన్‌ గడువు ముగియడంతో వారిని కొనసాగిస్తూ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటిని అమలు చేయకుండా వ్యవసాయాధికారుల విధులకు సహాయ సంచాలకులు ఆటంకం కలిగించడంపై ఎందుకు ఆదేశాలు అమలు చేయలేదని ఈనెల 23న షోకాజ్‌ నోటీసు జారీచేశారు. కమిషనర్‌ ఆదేశాలు అమలు చేయకపోవడంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల మార్కెట్‌లో అనుమతులు, దుకాణాలకు రెన్యువల్‌ తదితర అంశాలకు సంబంధించి మార్కెట్‌లో అస్పష్టత ఏర్పడింది. ఈవిషయం కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో వివరాలు తెప్పించుకుని బాధ్యుడైన ఏడీఏకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. సహాయ సంచాలకుల పరిధిలో నిబంధనల మేరకు ఆయా కార్యక్రమాలు అమలు చేయకపోవడంతో వాటిపై వివరణ కోరుతూ జిల్లా వ్యవసాయాధికారి సహాయ సంచాలకులకు మెమో ఇచ్చారు. కొన్ని నెలలుగా వివిధ అంశాల అమలులో నిర్లక్ష్యంపై సహాయ సంచాలకులు ఇచ్చిన వివరణను జిల్లా వ్యవసాయాధికారి ఆ శాఖ కమిషనర్‌కు పంపారు. గుంటూరు సహాయ సంచాలకుల పరిధిలో పెదనందిపాడు, ప్రత్తిపాడు, పెదకాకాని, గుంటూరు గ్రామీణం, గుంటూరు నగరం, వట్టిచెరుకూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. ఈపరిధిలో వివిధ కారణాలతో సాగు ఉత్పాదకాల నమూనాల సేకరణ, నాణ్యత పరిశీలన, రికార్డుల తనిఖీ వంటి అంశాలు సక్రమంగా జరగడం లేదు.  జిల్లాల విభజన తర్వాత ప్రత్యేకించి గుంటూరు నగర పరిస్థితి నిర్లక్ష్యంగా మారింది. అధికారులకు బాధ్యతలు అప్పగించడం, సిబ్బంది కేటాయింపు విషయంలోనూ జాప్యం జరిగింది. 2022 ఖరీఫ్‌ సీజన్‌లో కీలకమైన సమయంలో మే, జూన్‌, జులైలో నాణ్యత, నియంత్రణ పర్యవేక్షించే అధికారుల కేటాయింపులో జాప్యం చోటుచేసుకుంది. షోకాజ్‌ నోటీసుకు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు