ముడిపడని ముహూర్తం
ముహూర్తం ముడిపడట్లేదు. గడువులు పెంచుకుంటూ పోతున్నా లక్ష్యం చేరడం లేదు. ఇప్పటికి మూడుసార్లు గృహ ప్రవేశాల ముహూర్తం మారింది
ఇప్పటికి మూడుసార్లు వాయిదా
గడువు ఏప్రిల్ 15కు పెంచినా ఇళ్ల నిర్మాణం సాధ్యమేనా
న్యూస్‌టుడే, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల గ్రామీణ
సత్తెనపల్లి మండలం గండ్లూరు లేఔట్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు
ముహూర్తం ముడిపడట్లేదు. గడువులు పెంచుకుంటూ పోతున్నా లక్ష్యం చేరడం లేదు. ఇప్పటికి మూడుసార్లు గృహ ప్రవేశాల ముహూర్తం మారింది. ఇటీవల మళ్లీ ఏప్రిల్ 15న గృహ ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలనే లక్ష్యం నిర్ధేశించారు. ఈలోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలందాయి. ఈ సారైనా లక్ష్యం చేరుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నవరత్నాలు.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని భావించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తవకపోవడంతో ఉగాదికి గృహ ప్రవేశాలు జరగలేదు. అంతకు ముందు డిసెంబరు 21న ఈ ప్రక్రియ చేపట్టాలని భావించారు. తర్వాత దాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి.. ఉగాది వెళ్లిపోయినా అనుకున్న మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వలేదు.
రుణం దొరక్క పనులు ఆపేశా..
మాది పెదకూరపాడు. పాటిబండ్ల రహదారిలోని లోతట్టు ప్రాంతంలో వాగు పక్కనే ఇంటి స్థలం ఇచ్చారు. పక్కాగృహ నిర్మాణ పనులు మొదలుపెట్టేదాకా ఒత్తిడి చేశారు. రూ.లక్ష అప్పుచేసి బేస్‌మెంట్ పూర్తి చేశా. మెరక తోలుకునేందుకు రూ.30 వేలు ఖర్చయింది. అసలే లేఔట్‌లో సౌకర్యాలు లేవనుకుంటే ఇంటి వరకు వెళ్లడానికి కూడా సరిగ్గా దారి లేదు. చిన్న వర్షం పడినా కూలీలు, వాహనాలు రావడం లేదు. మరో రూ.3 లక్షలు పెడితేనే ఇల్లు ఓ రూపుకొచ్చేలా ఉంది. అంత డబ్బు ప్రభుత్వమిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చేసిన అప్పు తీర్చలేని పరిస్థితిలో ఇంటి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలో అర్థమవడం లేదు. అప్పు దొరక్క పనులు ఆపేశా.
పరగటి మీనాక్షి, పెదకూరపాడు
కారణాలివీ..
ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయం సరిపోకపోవడం.. భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశన్నంటుతుండటం.. పనులు ప్రారంభించిన వారికి బిల్లులు సకాలంలో అందకపోవడం.. జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు లోపించడం.. అవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటంతో చాలామంది పక్కాఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపించట్లేదు. పునాదులు తీయకుంటే ఇంటి పట్టాతోపాటు పక్కా ఇంటికి మంజూరు చేసిన సాయం చేజారిపోతుందనే భయంతో అరకొర పనులతో ఎక్కువ మంది సరిపెడుతున్నారు.
* పల్నాడు జిల్లాలో మండలాలు, పట్టణాలు, నగర పంచాయతీలు కలిపి 36 ఉండగా 18చోట్ల జగనన్న పక్కాగృహ నిర్మాణ పనులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి నూజండ్ల, యడ్లపాడు, వినుకొండ, సత్తెనపల్లి, అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు మండలాలు.. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలతోపాటు నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల్లో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి.
* సత్తెనపల్లి పట్టణం, మండలానికి మంజూరైన పక్కాఇళ్లలో సింహభాగం ప్రైవేట్ గుత్తేదారులు చేపడుతున్నారు. 1797 ఇళ్ల నిర్మాణాలకు వారు ముందుకొచ్చారు. అయితే వారికి రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. సొంతంగా నిర్మాణాలు చేపట్టే వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇటీవలే పెండింగ్ బిల్లులు మంజూరు చేశారు. గుత్తేదార్లు పెట్టుబడులు పెట్టి ఇప్పటివరకు చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో పనులు నెమ్మదిగా చేపడుతున్నారు. పట్టణానికి లేఔట్లు దూరంగా ఉండటం.. వసతులు లోపించడం.. ప్రభుత్వమిచ్చే సాయం తక్కువగా ఉండటంతో ఇంటి నిర్మాణాల్ని పునాదుల దశలోనే నిలిపేసినట్లు సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసరావు, మాబుసుభాని చెప్పారు.
అత్యధికం సత్తెనపల్లిలో.. అత్యల్పం మాచర్లలో..
సత్తెనపల్లి మండలానికి 1755 పక్కా ఇళ్లు మంజూరవగా 718 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇదే పట్టణానికి సంబంధించి 3262 మంజూరవ్వగా 411 పూర్తయ్యాయి. జిల్లాలో పక్కాఇళ్ల నిర్మాణం సత్తెనపల్లిలో పురోగతిలో ఉంది. మాచర్ల పట్టణంలో అత్యల్ప పురోగతి ఉంది. ఈ పట్టణానికి 4478 ఇళ్లు మంజూరవగా కేవలం 145 పూర్తయ్యాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు 5892 పక్కాఇళ్లు మంజూరవగా కేవలం 739 పూర్తయ్యాయి. మండలాల్లో అచ్చంపేటకు అత్యధికంగా 3422 పక్కా ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 402 పూర్తయ్యాయి. లక్ష్యాలు వేలల్లో ఉంటే ప్రగతి వందల్లో కనిపిస్తోంది. కొత్త లక్ష్యానికి అనుగుణంగా ఇంటి నిర్మాణాల్ని వేగవంతం చేయడంపై గృహనిర్మాణశాఖ అధికారులు దృష్టి సారించారు. ఏప్రిల్ 15లోపు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకునేందుకు కృషి చేస్తామని గృహనిర్మాణశాఖ డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ‘న్యూస్‌టుడే’ బృందానికి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. రైతు సంఘాలు
-
Movies News
Sobhita Dhulipala: మోడలింగ్ వదిలేయడానికి అసలైన కారణమదే: శోభితా ధూళిపాళ్ల
-
Politics News
Balineni: పార్టీలోని కొందరు కావాలనే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో భేటీ అనంతరం బాలినేని
-
Sports News
IPL 2023: ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన.. అతడికి మంచి భవిష్యత్తు : వసీమ్ అక్రమ్
-
India News
Doctors: ఏళ్లపాటు విధులకు డుమ్మా.. వీళ్లేం వైద్యులు బాబోయ్!
-
Movies News
Social Look: షిర్లీ సేతియా ‘స్ట్రాబెర్రీ కేక్’.. ‘బ్లూ ఏంజెల్’లా ప్రియా వారియర్.. కృతిశెట్టి శారీ