logo

తూకం ఏదైనా.. మోసం అదే తీరున

చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఐటీ ఇంజినీరు ఒకరు స్థానికంగా ఒక బంగారు దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో సంబంధిత ఆభరణాలలో బంగారు, రాగి శాతాలను

Updated : 30 Mar 2023 11:55 IST

స్వచ్ఛత.. రాళ్ల బరువు తేడాలోనూ దోపిడీ  
బంగారం కొనుగోలులో నష్టపోతున్న వినియోగదారులు
ఈనాడు - నరసరావుపేట, బాపట్ల

చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఐటీ ఇంజినీరు ఒకరు స్థానికంగా ఒక బంగారు దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో సంబంధిత ఆభరణాలలో బంగారు, రాగి శాతాలను దుకాణం వారు సూచించిన విధంగా ధరను చెల్లించారు. దుకాణం వారు చెప్పినట్లు ఆభరణాలలో బంగారు, రాగి శాతం కచ్చితంగా ఉన్నాయా? లేదా? అని పరీక్ష చేయిస్తే బిల్లులో ఇచ్చిన దానికంటే రాగి శాతం పెరిగి బంగారం తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నిఘా విభాగం అధికారులకు ఫిర్యాదు చేసి సంబంధిత దుకాణంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా కొనుగోలుదారులు నిత్యం మోసపోతున్న సంఘటనలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాధారణంగా మారాయి. అవగాహన లేకపోవడంతో ఈ మోసాలు బహిర్గతం కావడం లేదు.

కాటాలను మిల్లీగ్రాముల నుంచి పరీక్షించే యంత్రం

గుంటూరు నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణాల్లో బంగారం దుకాణాలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక తూనికలు-కొలతలు యంత్రాలు అందుబాటులోకి వచ్చినా కొందరు దుకాణదారులు ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. బంగారం గ్రాము ధర రూ.5వేలకుపైగా ఉండటంతో వినియోగదారులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. తూకాల్లో మోసాలు తగ్గినా ఆభరణాల తయారీలో వాడే బంగారం నాణ్యత, రాగి శాతం, రాళ్ల బరువు, తరుగు తదితర అంశాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఐటీ ఇంజినీరుకు అనుమానం రావడంతో పరీక్ష చేయించగా రాగి, బంగారం బరువు ఎంత ఉందో కచ్చితంగా తేలింది. ఈమేరకు బిల్లుల్లో పేర్కొన్న వివరాలు సరిపోల్చి మోసం జరిగిందని గుర్తించి ఫిర్యాదు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసే వారికి అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు. తూకం విషయమై తూనికలు, కొలతలు శాఖ ఆకస్మిక తనిఖీలు, రెగ్యులర్‌గా తూకం యంత్రాలను పరిశీలించడం ద్వారా తూకం మోసాలకు అడ్డుకట్ట పడింది. ఏడాది కాలంలో బంగారం దుకాణాల్లో వివిధ అంశాల్లో లోపాలు గుర్తించి 34 కేసులు నమోదు చేసి రూ.3.48 లక్షలు అపరాధ రుసుం విధించారు. అదేవిధంగా బంగారం దుకాణాల్లో 920 కాటాలను పరిశీలించి సరిచేశారు.

బిల్లులు లేకుండా విక్రయాలు  

బంగారం కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులు వారికి సమీపంలోని పట్టణాల్లోని దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే పన్నులు చెల్లించకుండా కొంత తగ్గుతుందన్న ఉద్దేశంతో స్థానిక దుకాణాల్లో బిల్లులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో వ్యాపారులు కొనుగోలుదారులను సులభంగా మోసం చేస్తున్నారు. 22 క్యారెట్‌ స్వచ్ఛతతో ఉన్న బంగారం ఇస్తున్నామని వ్యాపారులు చెప్పి ఆమేరకు సొమ్ము వసూలు చేస్తున్నారు. అయితే ఇది 18 నుంచి 22 క్యారెట్ల మధ్య స్వచ్ఛత ఉన్నట్లు పలు సందర్భాల్లో తనిఖీ అధికారులు గుర్తించి దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే నగరాలు, పెద్ద పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నా వినుకొండ, మాచర్ల, రేపల్లె, చిలకలూరిపేట వంటి పట్టణాల్లో తరచూ తనిఖీలు జరగడం లేదు. బంగారు ఆభరణాలు తయారు చేసే క్రమంలో కలుపుతున్న మిశ్రమాలు కూడా బిల్లుల్లో సక్రమంగా నమోదు చేయడం లేదు. బంగారం పరిమాణం ఎక్కువగా చూపి, రాగి, ఇతర మిశ్రమాల పరిమాణం తక్కువగా చూపి వ్యాపారులు ఎక్కువగా మోసం చేస్తున్నారు. ఒక గ్రాము బంగారం తేడా వస్తే వినియోగదారులు రూ.5వేలకుపైగా మోసపోతున్నారు. ఇప్పటికైనా కొనుగోలుదారులు బిల్లులో సూచించిన విధంగా బంగారం, ఇతర మిశ్రమాల బరువు కచ్చితంగా ఉన్నాయా? లేదా? అని సరిచూసుకుని నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తూనికలు, కొలతలు శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒక మిల్లీగ్రాము బరువు కూడా కచ్చితంగా కాటాలు తూచే విధంగా నిబంధన అమలులో ఉంది. ఇది బంగారం దుకాణాల్లో కచ్చితంగా అమలుచేయాలి.  


అప్రమత్తతతోనే అడ్డుకట్ట

- షాలీంరాజు, డిప్యూటీ కంట్రోలర్‌, తూనికలు, కొలతలు శాఖ, గుంటూరు

ఒక మిల్లీగ్రాము బరువు కూడా తూచే యంత్రాలను కచ్చితంగా వాడుతున్నారో లేదో పరిశీలించాలి. మనం కొనుగోలు చేసే ఆభరణంలో రాళ్ల బరువు, నికరమైన బంగారం బరువు కచ్చితంగా తెలుసుకోవాలి. రాళ్లకు చెల్లించే సొమ్ము తక్కువగా బంగారం ధర ఎక్కువగా ఉన్నందున రాళ్ల బరువు బంగారంలో కలిపే అవకాశమున్నందున రెండింటి బరువు కచ్చితంగా తెలుసుకోవాలి. బిల్లులో నమోదుచేసిన బరువు మేరకు ఆభరణం ఉందా? లేదా? చూసుకోవాలి. మనం కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛత 24 క్యారెట్‌ నుంచి 18 క్యారెట్లలో ఏ నాణ్యత కలిగి ఉందో నిర్దారించుకోవాలి. ఇందుకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువకు వస్తుందని, మనకు తెలిసినవారే అని జాగ్రత్తలు తీసుకోకుండా బంగారం కొనుగోలు చేయడం మంచిది కాదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని