logo

అక్రమాలకు లెక్కలేదు!

ఒకే కొండ ప్రాంతంలో పదుల సంఖ్యలో లీజులు తీసుకున్నారు. ఒకరి పక్కనే మరొకరు క్వారీయింగ్‌ చేస్తున్నారు. ఎంత లోతుకు తవ్వుతున్నా రాయి వస్తోంది. నిత్యం పేలుళ్ల ద్వారా కొండరాళ్లను పగులగొట్టి క్రషర్లకు తరలించి కంకర ఉత్పత్తులు

Published : 30 Mar 2023 05:28 IST

క్వారీల్లో అనుమతికి మించి తవ్వకాలు, రవాణా
రాయల్టీ ఎగ్గొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈనాడు, గుంటూరు

గుంటూరు సమీపంలోని చినపలకలూరు కొండల్లో బ్లాస్టింగ్‌ చేయడంతో వెలువడిన పొగ

కే కొండ ప్రాంతంలో పదుల సంఖ్యలో లీజులు తీసుకున్నారు. ఒకరి పక్కనే మరొకరు క్వారీయింగ్‌ చేస్తున్నారు. ఎంత లోతుకు తవ్వుతున్నా రాయి వస్తోంది. నిత్యం పేలుళ్ల ద్వారా కొండరాళ్లను పగులగొట్టి క్రషర్లకు తరలించి కంకర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంలో తవ్వుతున్నామని, పర్మిట్లు ఉన్నాయని చెప్పి అనుమతి లేని ప్రాంతంలోనూ, అనుమతించిన ప్రాంతంలో పరిమితికి మించి తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రాయి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. భూగర్భ గనుల శాఖ నిఘా విభాగం తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించడంతో అక్రమాల డొంక కదిలింది. 9 మంది లీజుదారులకు రూ.102 కోట్ల సొమ్ము అపరాధ రుసుం విధించడం ఇక్కడి అక్రమ తవ్వకాలకు నిదర్శనం. గుంటూరు సమీపంలోని చినపలకలూరు, మేడికొండూరు మండలం పేరేచర్ల కొండల్లో జరుగుతున్న కంకర క్వారీల్లో తవ్వకాల తీరిది.

హద్దులు దాటి తవ్వకాలు

మేడికొండూరు మండలం పేరేచర్ల పరిధిలో సర్వే నంబరు 155-ఏ1, గుంటూరు గ్రామీణ మండలం చినపలకలూరు గ్రామంలో సర్వే నంబరు 111లో రెండు ప్రాంతాల్లో కలిపి 44 క్వారీ లీజులు ఉన్నాయి. కొండలు మొత్తం రాయితో నిండి ఉండడంతో లీజుకు తీసుకుని క్రషర్లు ఏర్పాటుచేసుకుని కంకర, ఇతర ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఒకే కొండ పరిధిలో పదుల సంఖ్యలో లీజులు ఉండటంతో ఎవరు ఎక్కడ తవ్వుతున్నారో తెలియని పరిస్థితి. ఇద్దరు లీజుదారుల మధ్య సరిహద్దు కోసం(బఫర్‌) వదిలిపెట్టాలి. ఈ విధానం పేరేచర్ల, చినపలకలూరు కొండల్లో మచ్చుకైనా కనిపించదు. కొండలో ఒకరి పక్కనే మరొకరు క్వారీయింగ్‌ చేసి రాయిని తీసుకెళ్తున్నారు. ఎవరు ఎంత పరిమాణంలో తవ్వుతున్నారో లెక్కలు తెలియని పరిస్థితి. సాయంత్రం 3 నుంచి 5గంటల మధ్య పేలుళ్లు జరుపుతున్నారు. పేలుళ్లు జరిపినప్పుడు ఈ ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళి గాలిలో కలిసి పొగలాగా వ్యాపిస్తోంది. రోజువారీగా ఎంత తవ్వుతున్నారన్న అంశాలు నమోదు చేయడం లేదు. అనుమతించిన పరిమాణానికి మించి తవ్వి తరలిస్తున్నా నిఘా విభాగం ప్రత్యేకంగా తనిఖీలు చేస్తే కానీ గుర్తించే పరిస్థితి లేదు. పర్మిట్లు తీసుకున్న పరిమాణం కంటే అదనంగా తరలించే రాయికి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. లీజుదారులు కొంత మొత్తానికి పర్మిట్లు తీసుకుని పెద్దఎత్తున రవాణా చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గండిపడుతోంది. గతంలో తక్కువ సామర్థ్యంతో క్రషింగ్‌ యూనిట్లు పనిచేయడం వల్ల రాయి తరలింపు పెద్దఎత్తున ఉండేది కాదు. ప్రస్తుతం క్రషింగ్‌ యూనిట్ల సామర్థ్యం పెరగడంతో ముడిరాయి తవ్వకం పనులు భారీ ఎత్తున జరుగుతున్నాయి.

9 కేసులు రూ.102 కోట్ల అపరాధ రుసుం

పేరేచర్ల, చినపలకలూరు కొండల్లో రాయి తవ్వకాలపై ఫిర్యాదుల నేపథ్యంలో భూగర్భ గనులశాఖ నిఘా విభాగం తనిఖీలు చేపట్టింది. లీజుదారులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మ్యాపు ఆధారంగా తవ్వకాలు చేశారా? ఎన్ని పర్మిట్లు తీసుకున్నారు? తవ్విన పరిమాణానికి, పర్మిట్లకు లెక్క సరిపోయిందా? సరిహద్దులు దాటి ఏమైనా రాయి తవ్వి తరలించారా? వంటి అంశాలను సర్వే చేసి నిఘా విభాగం లెక్కలు తేల్చింది. దీంతో పెద్దఎత్తున అనుమతికి మించి తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. అక్రమంగా తవ్విన పరిమాణానికి లెక్కలు కట్టి 9 కేసులు నమోదు చేసి రూ.102 కోట్ల అపరాధరుసుం విధించారు. ఇందులో ఒక లీజుదారుడే రూ.75కోట్ల సొమ్ము చెల్లించాల్సి ఉంది. గుంటూరు సమీపంలోని కంకర క్వారీల్లోనే ఇంత పెద్దఎత్తున అనుమతికి మించి తవ్వకాలు జరిగితే మారుమూల క్వారీల్లో అక్రమాలు ఏ మేరకు ఉన్నాయో తనిఖీల్లో బహిర్గతం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని