logo

ప్రేమ జంట బలవన్మరణం

పెద్దలు తమ ప్రేమను అడ్డుకుంటున్నారన్న బాధతో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 05:28 IST

పెద్దలు అడ్డు చెప్పారనే..

సుద్దపల్లి (చేబ్రోలు), న్యూస్‌టుడే: పెద్దలు తమ ప్రేమను అడ్డుకుంటున్నారన్న బాధతో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శలపాడు గ్రామవాసి ఉయ్యూరు శ్రీకాంత్‌ (22) ఐటీఐ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి (19) తెనాలిలో డిగ్రీ ద్వితీయ ఏడాది చదువుతున్నారు. కొంత కాలంగా వీరిధ్దరూ ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను మందలించి, అతడితో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం త్రివేణి కళాశాలకు వెళ్లింది. మధ్యాహ్నం శ్రీకాంత్‌తో కలిసి వెళుతుండగా చూసిన స్నేహితురాలు త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు తెనాలి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. జాడ తెలియకపోవడంతో చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం సుద్దపల్లి రైల్వే గేటు సమీపంలో తలలు లేని రెండు మృతదేహాలను గుర్తించిన కీ మ్యాన్‌, వెంటనే సంగంజాగర్లమూడి స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. గుంటూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చేబ్రోలు పోలీసులకు విషయం తెలియడంతో ఫిర్యాదుదారులను పిలిపించి రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లగా,  మృతదేహం తమ కూతురుదేనని గుర్తించి బోరుమన్నారు. అనంతరం పోలీసులు ఇద్దరి పార్థివదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటూరు రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేతిలో చెయ్యేసుకుని: కలిసి జీవించ లేకపోయాం, కనీసం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఇద్దరూ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని రైల్వే ట్రాక్‌పై తలలు బయటకు పెట్టుకొని పడుకున్నారు. ఇద్దరి తలలు చిధ్రమవగా, శ్రీకాంత్‌  మృతదేహాన్ని రైలు సుమారు వందడుగుల దూరం ఈడ్చుకుపోయినట్లు రాళ్లపై రక్తపు చారలు ఏర్పడ్డాయి. మృతుడి కుడి చేయి తెగిపోయి సమీప విద్యుత్తు స్తంభం వద్ద పడి ఉంది. మృతురాలి కుడి చేతిలో మృతుడి ఎడమ చేతి వేళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్నిబట్టి ఇద్దరూ చేతులు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురూ బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని