logo

శస్త్రచికిత్సలకు కొత్త యంత్రాలు

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు అత్యాధునిక సీయామ్‌ యంత్రాలు (మిషన్లు) ఎట్టకేలకు సమకూరాయి. వాటి కోసం సుమారు ఏడాది నుంచి వైద్యులు నిరీక్షిస్తున్నారు.

Published : 31 Mar 2023 05:35 IST

అసౌకర్యం తప్పిందన్న జీజీహెచ్‌ వైద్యులు
ఈనాడు, అమరావతి

యూరాలజీ విభాగంలో సీయామ్‌ పరికరం

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు అత్యాధునిక సీయామ్‌ యంత్రాలు (మిషన్లు) ఎట్టకేలకు సమకూరాయి. వాటి కోసం సుమారు ఏడాది నుంచి వైద్యులు నిరీక్షిస్తున్నారు. ఇవి అందుబాటులో లేక శస్త్రచికిత్సలు వాయిదా పడేవి. వైద్యులు పదేపదే ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా స్పందించిన ప్రభుత్వం తాజాగా వాటిని పంపింది. ప్రస్తుతం ఉన్న యంత్రాలు బాగా పాతవి. అవి ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉన్న యంత్రాలతోనే అతికష్టం మీద రోగులకు అసౌకర్యం కలగకుండా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. ప్రస్తుతం కొత్త పరికరాల సహాయంతో శస్త్రచికిత్సలు సులభంగా, వేగంగా పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలు

న్యూరో సర్జరీ, యూరాలజీ, ఆర్థో విభాగాలకు సుమారు రూ.కోటి విలువైన యంత్రాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ వైద్య, మౌలిక సదుపాయాల కల్పనా అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కొనుగోలు చేసి పంపింది. వాటిని ఆయా విభాగాల్లో టెక్నీషియన్లు బిగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో తరచూ శస్త్రచికిత్సలు వాయిదా వేస్తూ ఉండేవారు. ఆపై ఇంప్లాంట్స్‌, స్క్రూస్‌ అమర్చినప్పుడు అవి సరైన స్థితిలో ఇమిడాయో లేదోనని ఆందోళన చెందేవారు. యంత్రాలు పనిచేస్తుంటే ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఓ రకంగా ఇవి ఎక్సరే లాంటివని, ఎక్కడ ఎముకలు విరిగాయి, ఎక్కడ వంకర ఉన్నాయో కూడా ఎక్సరే తీయడం ద్వారానే బయటపడుతుంది. ఎక్సరే తీయడం వల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయో సీయామ్‌ యంత్రాలను అలాగే వినియోగించుకోవచ్చు. కాళ్లకు ఇంప్లాంట్స్‌, మెదడు, నరాలకు క్లిప్స్‌, ఎముకల పటిష్ఠానికి వాడే ప్లేట్స్‌, రాడ్స్‌ వంటి పరికరాలు సరైన స్థితిలో ఉన్నాయా? లేదా అనేది సర్జరీ సమయంలో సరిచూసుకుంటారు. ప్రస్తుతం పంపిన ఆ మూడు యంత్రాలు ఎముకలు-కీళ్లు, నరాలు-మెదడు, మూత్రపిండాల విభాగాలకు కేటాయించడంతో సంబంధిత విభాగాధిపతులు ఇక మీదట శస్త్రచికిత్సలు వేగవంతంగా పూర్తి చేయడానికి ఆస్కారం కలిగిందని తెలిపారు.

త్వరగా కొలిక్కి...

ఆయా విభాగాల్లో ఈ యంత్రాలు లేకుండా రోగికి శస్త్రచికిత్సలు చేయడం చాలా క్లిష్టతరంతో కూడుకున్న వ్యవహారమని, అదే వాటిల్లో చూస్తూ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు. సుమారు ఏడాది క్రితం రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఆసుపత్రి పరిశీలనకు రాగా అప్పట్లో ఆసుపత్రి వైద్యులు, పీజీ డాక్టర్లు యంత్రాల లేమి కారణంగా పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యంత్రాలు అందుబాటులో ఉంటే రోగికి చేసే శస్త్రచికిత్సకు సంబంధించి ప్రతిదీ అందులో చూసుకుని చేస్తాం కాబట్టి కచ్చితంగా దాని నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తవు. అవి లేకుండా శస్త్రచికిత్సలకు ఉపక్రమిస్తే చాలా సమయం తీసుకుంటోందని, వాటిని సమకూర్చాలని కోరారు. ఒక రోగి మోకాలికి ఇంప్లాంట్‌ వేసినా, ఇంకేదైనా స్క్రూ బిగించినా దాని పొజిషన్‌ చెక్‌ చేసుకోవటానికి ఈ యంత్రాలు ఉపకరిస్తాయని ఏడాది నుంచి మొర పెట్టుకుంటే తాజాగా మూడు యంత్రాలు జీజీహెచ్‌కు పంపారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని