logo

ప్రసూతి విభాగం.. వసూళ్ల పర్వం..

వైద్య ఖర్చులు భరించలేక సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వస్తున్న పేద, మధ్య తరగతి రోగులను జీజీహెచ్‌లో కొంతమంది సిబ్బంది జలగల్లా పీడించి లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నా వారిలో మార్పు.

Published : 31 Mar 2023 05:34 IST

అబ్బాయి పుడితే రూ.2 వేలు, అమ్మాయికి రూ.1,000 ఇవ్వాల్సిందే

ప్రసూతి విభాగం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఖర్చులు భరించలేక సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వస్తున్న పేద, మధ్య తరగతి రోగులను జీజీహెచ్‌లో కొంతమంది సిబ్బంది జలగల్లా పీడించి లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని సస్పెండ్‌ చేయడం, అనంతరం విచారణలో ఏమీ తేలలేదని మొత్తం జీతం ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మంగళవారం ఆసుపత్రికి వచ్చి లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఎవరో తనకు తెలియాలని డిమాండ్‌ చేయడంతో కలకలం రేపింది. దీనిపై తనకు చాలా మంది ఫిర్యాదు చేశారని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ, గుంటూరు సర్వజనాసుపత్రిలో అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం.

లంచం అడిగారు.. ఇచ్చాం

జీజీహెచ్‌లో లంచాలు వసూలు చేయడంపై ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో సతీష్‌కుమార్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ప్రసూతి విభాగంలో రహస్యంగా విచారణ జరిపారు. అధికారులు నేరుగా వార్డుకు వెళ్లి చికిత్స పొందుతున్న తల్లులతో పాటు, వారి బంధువులతో మాట్లాడారు. దీంతో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. వార్డులో ఉన్నవారిలో 14 మంది తాము ఉద్యోగులకు లంచాలు ఇచ్చిన మాట వాస్తవమేనని రాతపూర్వకంగా తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణులను శస్త్రచికిత్స మందిరానికి తీసుకెళ్లి సిజేరియన్‌ చేసిన అనంతరం శిశువులను ఇవ్వాలంటే అక్కడ పని చేసే సిబ్బందికి లంచం ఇవ్వాల్సి వస్తోందని తెలిపినట్లు సమాచారం. మగ బిడ్డ పుడితే ఒక రేటు, అమ్మాయి అయితే మరో రేటు పెట్టి వసూళ్లకు తెగబడుతున్నారని తెలిపారు. అనంతరం ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ విభాగంలో పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు తాఖీదులిస్తూ సూపరింటెండెంట్‌ ఆదేశాలిచ్చారు.


సరైన చర్యలు లేకపోవడం వల్లే

ర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో నెలకు 900 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మగబిడ్డ పుడితే రూ.2 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.1,000 రేటు పెట్టి అక్కడ పని చేసే సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్నిబట్టి లక్షల రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటికి తెలిస్తే తూతూమంత్రంగా విచారణ చేసి చేతులు దులిపేసుకోవడం అధికార యంత్రాంగానికి అలవాటైపోయింది. దీంతో తమను ఏమీ చేయరనే భావన అక్కడ పని చేసే వారిలోనూ ఏర్పడింది. ప్రసవం సమయంలో తాము ఎంతో కష్టపడి పని చేస్తుంటామని, అన్నీ తామే శుభ్రం చేస్తుంటామని తెలియజేస్తారు. పది నెలల కిందట అదే విభాగంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. ఇటీవలే విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం జిల్లా పాలనాధికారికి దస్త్రం పంపి తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారు. నాలుగు నెలల కిందట మరో కేసులో లంచం ఇచ్చామని ఫిర్యాదు చేసిన వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత వారిని విచారణకు రావాల్సిందిగా కోరడంతో వారు రాలేకపోయారు. ఆసుపత్రిలో నాలుగు రోజులు ఉన్నా ఎందుకు విచారణ చేయలేదని వారడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో విచారణను ముగించి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని అక్కడి నుంచి మార్చేసి చేతులు దులిపేసుకున్నారు. అలాకాకుండా ప్రత్యేక నిఘా పెట్టి లంచం అడిగేవారిపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోలేకపోతున్నారు.


పర్యవేక్షణ కరవు

ర్వజనాసుపత్రిలో పర్యవేక్షణకు చాలా మంది అధికారులే ఉన్నారు. అయినప్పటికీ వారంతా కార్యాలయాలకే పరిమితమైపోతున్నారు. దీంతో వార్డుల్లో పని చేసేవారి గురించి పట్టించుకోవడంలేదు. నిత్యం తనిఖీలు చేసి రోగుల సహాయకులతో మాట్లాడితే వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పత్రికల్లో వార్తలు వచ్చిన రెండు రోజులు కొద్దిగా హడావుడి కనిపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితి మామూలుగానే ఉంటుంది తప్ప ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని