logo

ఊపిరి పోతున్నా పట్టించుకోరే..!

పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఆసుపత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాచేపల్లి నగర పంచాయతీ ఇరికేపల్లి వాసులకు దాపురించింది.

Published : 31 Mar 2023 05:34 IST

పరిశ్రమల నుంచి విషవాయువులు
రోగాల బారిన ప్రజలు

ఇరికేపల్లిలో బోరు నుంచి వస్తున్న కలుషిత నీరు

దాచేపల్లి, న్యూస్‌టుడే: పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఆసుపత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాచేపల్లి నగర పంచాయతీ ఇరికేపల్లి వాసులకు దాపురించింది. నడికూడి పారిశ్రామికవాడ నుంచి వెలువడే హానికర వాయువులతో గ్రామస్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనిపై గతేడాది జూన్‌ నెలలో ప్రజలు ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులు కమిటీని వేశారు. నేటికీ ఆ కమిటీ నివేదికను వెల్లడించలేదు. ప్రజల ప్రాణాలపై కనీస బాధ్యత మరచిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. యథాతథంగా కర్మాగారాలు తమ ఉత్పత్తులను మొదలు పెట్టింది. పారిశ్రామికవాడలో పలు పరిశ్రమలకు అనుమతులు లేకపోయినా నడుపుతున్నారు.

ప్రాణాలతో  చెలగాటం..

పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఎక్కడ బోరు వేసినా వ్యర్థ జలాలు వస్తున్నాయి. విషవాయువులు, దట్టమైన పొగ, దుర్వాసనతో చాలా మందికి శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా ఇరికేపల్లి, నారాయణపురం, గామాలపాడు, దుర్గాభవానీ కాలనీ, సీపీఐ కాలనీ, నడికూడి ఎస్సీ కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యతో బాధపడుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం గ్రామస్థులకు కనీసం రక్షిత నీటి సరఫరా, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటంలేదు. స్థానికులకు శాశ్వత ఉద్యోగ ప్రతిపాదనలు సైతం కేటాయించకపోవటం గమన్హారం.

అదనపు  కర్మాగారం కోసం..

పారిశ్రామికవాడలో ఇటీవల రెండు కర్మాగారాల కోసం అనుమతి ఇవ్వాలని నగర పంచాయతీని ఆశ్రయించారు. సర్వసభ సమావేశంలో కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. పర్యావరణానికి విఘాతం కలిగించి, మానవాళికే ప్రమాదకరంగా మారిన పరిశ్రమకు అనుమతి లేదని ఘాటుగా స్పందించారు.


ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందేమో..

- నవభారత్‌రెడ్డి, ఇరికేపల్లి

రసాయన కర్మాగారాల నుంచి వెలువడే విష వాయువులతో ఊరు వదిలి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన, కలుషిత నీరు వ్యాధుల బారిన పడుతున్నాం. ఆసుపత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి ప్రాణాలు కాపాడుకుంటున్నాం. వారిలో కొంత మంది చనిపోయారు. పశువులు సైతం మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వమే చొరవ తీసుకొని పరిశ్రమలను మూయించాలి.


ఉన్నతాధికారులకు నివేదిక పంపాం

- అనిశెట్టి శ్రీవిద్య, కమిషనర్‌, నగర పంచాయతీ, దాచేపల్లి

కౌన్సిల్‌ సమావేశంలో నడికూడి పారిశ్రామికవాడలోని రసాయన కర్మాగారాలకు సంబంధించి నివేదికను జిల్లా కలెక్టరుకు పంపాం. అనుమతులు లేకుండా పరిశ్రమలు నడిపితే ఊరుకోం. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు