logo

Crime News: ప్రియురాలి చేతిలో ప్రియుడి హతం

మద్యం తాగి వేధిస్తున్నాడన్న కారణంతో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హతమార్చిన ఘటన తెనాలి మండలం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది.

Updated : 01 Apr 2023 08:10 IST

ఆరేళ్లుగా సహజీవనం

ఘటనా స్థలిలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై వెంకటేశ్వర్లు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే : మద్యం తాగి వేధిస్తున్నాడన్న కారణంతో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హతమార్చిన ఘటన తెనాలి మండలం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది. తెనాలి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం వివరాలు వెల్లడించారు. కూలీ పనులు చేసుకునే గద్దె రాము (28) సుమారు 6 ఏళ్లుగా తన్నీరు ఆమనితో సహజీవనం చేస్తున్నాడు.  భర్త నుంచి విడిపోయిన ఆమనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాముకు వివాహం కాలేదు. వారు రెండేళ్లుగా కఠెవరం కాలువపై చిన్న రేకుల షెడ్డు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఆమె ఇళ్లలో పనులు చేస్తుంది. రాము, ఆమని తరచూ గొడవపడుతుండేవారు. సమీపంలోనే నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు. ఆమెని గతంలో మరో వ్యక్తితో కూడా సన్నిహితంగా మెలిగింది. కొద్ది రోజుల కిందట రాము పిన్ని, ఆమె కుమార్తెలు ఇంటికి రాగా అందర్నీ చంపేస్తానంటూ ఆమని బెదిరించింది. ఈ క్రమంలో గురువారం రాత్రి రాము, ఆమని ఘర్షణ పడ్డారు. దీంతో ఆమె ఇంట్లోని కూరగాయల కత్తితో రాము గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి బయటకు వచ్చిన ఆమె తొలుత ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాముని కొట్టారంటూ చెప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి పోలీసులు చేరారు. ఇంటి లోపల మృతదేహం పడి ఉన్న తీరు, వస్తువులు చిందరవందరగా ఉండటం, ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో ఆ ప్రాంతంలోకి రావటాన్ని చూడలేదని స్థానికులు చెప్పటంతో అతనితో సహజీవనం చేస్తున్న ఆమనినే పోలీసులు అనుమానించారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆమె నేరం అంగీకరించింది. మద్యం తాగి వచ్చి రోజూ కొట్టడం, వేధిస్తుండటంతో కోపం పట్టలేక చంపేశానని ఆమె పోలీసులకు వివరించింది. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలోనే తండ్రి దూరం కావడం, ఇప్పుడు తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. తానూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నానని, ఇప్పుడు ఈ పిల్లలను ఎలా పెంచాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు