logo

‘జగన్‌ను ఓడిస్తేనే రాష్ట్రానికి విముక్తి’

‘ఈ నెల మూడో తేదీన సీఎం జగన్‌ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల విషయం చెబుతారని అంటున్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

అమరావతి రైతులకు వివిధ పార్టీల నాయకుల సంఘీభావం

మందడం దీక్షా శిబిరంలో భాజపా నేత సత్యకుమార్‌ను సన్మానించి అమరావతికి మద్దతుగా రైతులు, మహిళల నినాదాలు

మంగళగిరి, న్యూస్‌టుడే: ‘ఈ నెల మూడో తేదీన సీఎం జగన్‌ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల విషయం చెబుతారని అంటున్నారు. అదే కనుక నిజమైతే ప్రతిపక్షాల నెత్తిన పాలుపోసినట్లే. జగన్‌ ఇంటికి పోతేనే రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ మందడంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మంగళగిరి నుంచి శుక్రవారం ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా వెళ్లారు. ప్రదర్శనను రామకృష్ణ ప్రారంభించారు. తరువాత సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్‌, అక్కినేని వనజతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘తొందరగా ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. జగన్‌ ఇంటికిపోతే అమరావతి అభివృద్ధి అవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. పోలవరానికి నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రం మెడలు వంచుతానని చెప్పి మోడీ మోకాళ్ల వద్ద కూర్చుంటున్నావు. కేంద్రం పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పటికీ మాట్లాడలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. రైతులు, మహిళలపై కేసులు పెట్టించారు. అయినా సరే ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారనంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని విజ్ఞత ప్రదర్శించాలి’ అని సూచించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా రాజధాని ఇక్కడే అని ప్రకటన చేయాలని కోరుతున్నాం. విశాఖ రాజధాని కావాలని ఎవరూ కోరుకోవడం లేదు’ అని అన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి పునాది అమరావతి అని అన్నారు. నాయకులు మారుతీవరప్రసాద్‌, కోటా మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రాజధానిలో మట్టి పెళ్లను కూడా పెకిలించలేరు.. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని, దానిని తరలించడం కాదు... మట్టి పెళ్లను కూడా పెకిలించలేరని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా మందడంలోని దీక్షా శిబిరంలో శుక్రవారం నిర్వహించిన సభలో నాయకులు పాల్గొని అన్నదాతలకు సంఘీభావం తెలిపారు.


కేంద్రం జోక్యం అవసరం.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజధాని లేని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి.  అమరావతికి మంజూరు చేసిన కేంద్ర సంస్థల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి. వేల మంది రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్న జగన్‌కు బుద్ధి చెప్పాలి. రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

సుంకర పద్మశ్రీ, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌


జగన్‌ను ఓడించడం ఒకటే మార్గం.. రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులు అమల్లోకి రావాలంటే జగన్‌ను ఓడించడం ఒక్కటే మార్గం. జగన్‌ ఉంటే ఆ తీర్పులను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయరు. అమరావతి ఉద్యమం భారత దేశ స్థాయికి చేరింది. అమరావతి ఉండాలంటే జగన్‌ను ఓడించడానికి రైతులు, మహిళలు కంకణం కట్టుకోవాలి

 వీవీ లక్ష్మీనారాయణ, న్యాయవాది


రాజధానికి మద్దతుగా నిలిచాం.. ఒకసారి అవకాశమివ్వమని అడిగినందుకు రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మి గెలిపిస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మరో సారి అవకాశమిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. భాజపాపై అపోహలు ఉన్నా.. నాయకులుగా మేమంతా రాజధానికి మద్దతుగా నిలిచాం.

పాతూరు నాగభూషణం, భాజపా నాయకుడు


సీఎం ఇంటిని జప్తు చేస్తాం.. డిసెంబర్‌ తరువాత ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ఇంటిని జప్తు చేసి అమరావతి ప్రదర్శన శాలగా మారుస్తాం. సీఎం రాష్ట్రంలో ఉండటానికి వీలు లేకుండా చేస్తాం. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం. రాజధానిపై ప్రధాన మంత్రి మోదీ, అమిత్‌షా స్పందించాలి. దేశంలో కొత్త పార్లమెంట్‌ భవనం కట్టారు. పక్క రాష్ట్రంలో నూతన సచివాలయం కట్టారు. మాకు రాజధానే లేకుండా చేశారు. ఇప్పటికైనా దుర్మార్గులను వదిలి రాజధాని రైతుల వైపు ప్రజాప్రతినిధులు రావాలి. 

పోతులు బాలకోటయ్య, దళిత బహుజన కన్వీనర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని