ఉపాధి ప్రణాళిక
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 1.92 కోట్ల పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
మూడు జిల్లాల్లో 1.92 కోట్ల పని దినాలు
మొక్కల పెంపకానికి లభించని ప్రాధాన్యం
ఈనాడు-నరసరావుపేట, బాపట్ల
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 1.92 కోట్ల పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన పని దినాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది పనిదినాల ప్రణాళిక రూపొందించింది. ఏడాది మొత్తంలో నెలల వారీగా ఏ నెలలో ఎన్ని పని దినాలు కల్పించాలన్న విషయమై లక్ష్యాలు రూపొందించి నివేదిక సిద్ధం చేశారు. పని దినాలు లక్ష్యం మేరకు పూర్తి చేస్తే ఆ మేరకు సామగ్రి విభాగం కింద నిధుల లభ్యత పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు బాటలు పడతాయి. గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయం సిబ్బంది వేతనాలు, విద్యుత్తు బిల్లులు, కార్యాలయ నిర్వహణ, చిన్న చిన్న పనులు చేయడానికే సరిపోతుండటంతో గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఏం పని చేయాలన్నా సర్పంచులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పల్లెలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. గ్రామంలో కూలీలకు పని దినాలు కల్పన ద్వారా ఉపాధి లభించడంతోపాటు సామగ్రి విభాగం కింద సమకూరే సొమ్ముతో ప్రగతికి అవకాశాలు మెరుగవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు కూడా వీలైనంత మందికి పని కల్పించి పని దినాల సంఖ్య పెంచాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు.
జిల్లాల వారీగా పని దినాల లక్ష్యం ఇలా..
పల్నాడు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆయా మండలాల్లో పని దినాల సంఖ్యను నిర్దేశించి ఏడాది పొడవునా పని కల్పించనున్నారు. ఇక్కడ జల సంరక్షణ పనులు, చెరువుల్లో పూడికతీత, నీటికుంటల తవ్వకం, వాగుల్లో పూడిక తీత, పంట కాల్వలు, సాగు నీటికాల్వల పూడికతీత, గ్రామాల నుంచి పొలాలకు వెళ్లే దారుల నిర్మాణం, కందకాలు తవ్వడం వంటి పనులు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు నర్సరీల్లో మొక్కల పెంపకానికి కూడా నిధులు వెచ్చించాలి. నీటి సంరక్షణ, కాలువలు బాగు చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. గుంటూరు జిల్లాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని 30 లక్షల పనిదినాలు కేటాయించారు. బాపట్ల జిల్లాలో తీర ప్రాంతంలో అవసరాలకు అనుగుణంగా పనులు ప్రణాళిక రూపొందించారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇచ్చారు.
నాటేందుకు మొక్కలేవీ?
సహజంగా ఉన్న అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, వివిధ కారణాలతో అభివృద్ధి పేరుతో చెట్లు నరికివేస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వాతావరణంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అడ్డుకట్ట వేయడానికి మొక్కలను ఎక్కువగా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గతేడాది మొక్కలు కొనుగోలు, నిర్వహణ, సంరక్షణకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో నామమాత్రంగానే మొక్కల పెంపకం జరిగింది. ఈ ఏడాది పనిదినాల లక్ష్యంలో కూడా మొక్కల పెంపకానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీనికితోడు అటవీశాఖ సహకారంతో ఉపాధి హామీ పథకం నిధులతో గతంలో సామాజిక అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచేవారు. అటవీశాఖకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో వారు ఈసారి ముందుకు రావడం లేదు. ఉపాధి హామీ పథకం నిధులతో బయట నుంచి మొక్కలు కొనుగోలు చేసి నాటడానికి అనుమతి లేదు. ఉపాధి హామీ సిబ్బంది నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచే మౌలిక వసతులు లేవు. దీంతో అత్యంత కీలకమైన మొక్కల పెంపకానికి మొండిచేయి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే