logo

6 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానం

జిల్లా వ్యాప్తంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణబాబు తెలిపారు.

Published : 01 Apr 2023 05:38 IST

సమావేశంలో పాల్గొన్న శ్రావణబాబు, రత్నమన్మోహన్‌,    సుబ్బరాజు, అన్నపూర్ణ, సుబ్బరాయణ్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణబాబు తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో శ్రావణబాబు మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఈ కేంద్రాల్లో పొరుగు రోగులకు మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలందిస్తారని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి కేంద్రంలో 67 రకాల ఔషధాలు, 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందకు కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచామన్నారు. టెలీ మెడిసిన్‌ విధానంలో నిపుణులైన వైద్యుల సేవలందుతాయన్నారు. ఎన్‌సీడీ సర్వే ప్రకారం గుర్తించిన వ్యాధిగ్రస్థులకు చికిత్స ఎలా అందుతున్నదో పర్యవేక్షించాలన్నారు. మాతాశిశు మరణాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో నమోదైన గర్భిణులు ఇతర ప్రాంతాలకు వెళితే ఆ విషయాన్ని సంబంధిత వైద్యాధికారికి వెంటనే తెలియజేయాలన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సకాలంలో విధులకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఐవో సుబ్బరాజు, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో రత్నమన్మోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణ, డీఎంవో సుబ్బరాయణ్‌తోపాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని