logo

జన్మభూమి అభివృద్ధికి తపించిన వాసుదేవరావు

ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ నిరంతరం జన్మభూమి అభివృద్ధికి పంచుమర్తి వాసుదేవరావు తపించారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కొనియాడారు.

Published : 01 Apr 2023 05:38 IST

మాట్లాడుతున్న జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ నిరంతరం జన్మభూమి అభివృద్ధికి పంచుమర్తి వాసుదేవరావు తపించారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కొనియాడారు. సత్తెనపల్లి మండలం పణిదంలో స్వర్గీయ వాసుదేవరావు వర్ధంతి సభలో జస్టిస్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి హైకోర్టు తరలిరావడంతో గ్రామ పెద్దలతో తనకు మరింత సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు. ఈక్రమంలో సమీప బంధువైన వాసుదేవరావు తరచూ కలిసేవారన్నారు. నిత్యం గ్రామం, అక్కడి మౌలిక వసతుల లేమి తదితరాలపై చర్చించేవారన్నారు. ఆయన పేరున ఏర్పడిన పీవీఆర్‌ ట్రస్టు ద్వారా ఆయన కుమారుడు వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. విశ్రాంత జిల్లా జడ్జి మందడి చలపతిరావు మాట్లాడుతూ జన్మభూమి రుణం తీర్చుకున్న వారిలో వాసుదేవరావు ముందు వరుసలో ఉంటారన్నారు. విశ్రాంత ఎంపీడీవో పి.సత్యనారాయణ, మాజీ సర్పంచులు పంచుమర్తి అప్పారావు, ఎన్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

పణిదంలో పీవీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.15 లక్షలతో రూపుదిద్దుకున్న అభివృద్ధి పనులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. గ్రామ ప్రధాన కూడలిలో నిర్మించిన పంచుమర్తి వాసుదేవరావు కళావేదిక, గ్రంథాలయం వద్ద ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని, హిందూ శ్మశాన వాటికలో భవన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని