logo

అక్రమంగా కట్టిన దుకాణాలకు పన్నులా?

పురపాలక ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం అర్థం కాకుందంటూ పలువురు కౌన్సిలర్లు గట్టిగా నిలదీసిన సంఘటన చీరాలలో చోటుచేసుకుంది.

Published : 01 Apr 2023 05:38 IST

ఎలా వేస్తారు.. అధికారుల తీరును ప్రశ్నించిన కౌన్సిలర్లు 
వాడీవేడిగా చీరాల కౌన్సిల్‌ సమావేశం
చీరాల పట్టణం, న్యూస్‌టుడే

పట్టణంలో టౌన్‌హాలును ఆక్రమించుకుని దుకాణాలు కట్టారని ప్రశ్నిస్తున్న ఐదో వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి

పురపాలక ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం అర్థం కాకుందంటూ పలువురు కౌన్సిలర్లు గట్టిగా నిలదీసిన సంఘటన చీరాలలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన పురపాలక సంఘ సాధారణ సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. అయిదో వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి మాట్లాడుతూ... పట్టణంలో దాతలు పురపాలక సంఘానికి ఇచ్చిన టౌన్‌ హాలును ఆక్రమించుకుని పలు దుకాణాలు కట్టారని, దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా కట్టిన వాటికి పన్నులు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయా కౌన్సిలర్ల పరిధిలో పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, తాము ఇదేవిధంగా ఆక్రమించుకోవచ్చా? అని ప్రశ్నించారు. లక్ష్మితోపాటు కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్‌, మామిడాల రాములు మరికొందరు ఇదే అంశంపై మాట్లాడారు. ఆక్రమించుకుని కట్టిన దుకాణాలను తొలగించకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇందుకు డీఈ ఏసయ్య మాట్లాడుతూ... పొలిమేర రోడ్డులో కట్టిన రెండు దుకాణాలకు మీటర్లు కావాలని అర్జీ పెట్టుకున్నారన్నారు. అనంతరం టీపీవో వాటిని పరిశీలించి, రెవెన్యూ సెక్షన్‌కు పంపిన అనంతరం వారు పన్నులు వేసినట్లు చెప్పారు. ఏకాంబరేశ్వరరావు అనే వ్యక్తి ఈ స్థలం గురించి కోర్టులో కేసు వేశారని చెప్పారు. పన్నులు వేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆ దుకాణాలుంటే పన్నులు తీసివేసి, వాటిని తొలగించే అధికారం అధికారులకు ఉందని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. 16వ వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ... పట్టణంలో ఇప్పటికే చాలా విగ్రహాలు వెలిశాయని, రోడ్డు మధ్యలో డివైడర్ల స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే పార్కింగ్‌కు ఇబ్బంది తప్పదన్నారు. విగ్రహాలు ఏర్పాటుచేసుకునేందుకు పురపాలక సంఘం నుంచి కొంత స్థలాన్ని తీసుకుని, దానిలో అందరి విగ్రహాలు పెట్టుకోవాలని సూచించారు. ఏడో వార్డు కౌన్సిలర్‌ యాతం జ్యోతి మాట్లాడుతూ... తమ సచివాలయంలో రివ్యూ సమావేశం పెట్టడం లేదని, వార్డుపై దృష్టిసారించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేయాలన్నారు.

టెండర్‌ ప్రక్రియలో రైల్వే పైవంతెన

25వ వార్డు కౌన్సిలర్‌ పాపిశెట్టి సురేష్‌ మాట్లాడుతూ... చీరాలకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించారని, ఇంకా నిర్మాణం చేపట్టలేదని అధికారులు సమాధానం ఇవ్వాలన్నారు. అలాగే పురపాలక సంఘ పరిధిలో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని, వీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇందుకు డీఈ ఏసయ్య మాట్లాడుతూ... రైల్వే వంతెన ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియలో ఉందని చెప్పారు. 29వ వార్డు కౌన్సిలర్‌ అనిల్‌ స్పందిస్తూ.. చీరాలలో సుమారు 1400 మందికి స్థలాలు అవసరం ఉందని, దీనిపై శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కరణం వెంకటేష్‌లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. మరి కొన్నినెలల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. 28వ వార్డు కౌన్సిలర్‌ కీర్తి వెంకట్రావు మాట్లాడుతూ.... దండుబాట ప్రాంతంలో సుమారు 10 వార్డుల ప్రజలు మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. నిత్యం ఈ సమస్యతో వ్యాధుల బారిన పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ ప్రాంతాల్లో మురుగు కాలువలను సక్రమంగా శుభ్రం చేయటంలేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ... పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కృషిచేస్తున్నారన్నారు. ఇంకా అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి శాసనసభ్యులకు ఇస్తే వాటిని మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు సమకూరుస్తారని చెప్పారు. తొలుత అజెండాలోని మొత్తం 60 అంశాలతోపాటు సప్లిమెంటరీలో మరో రెండు అంశాలపై కౌన్సిలర్లందరూ చర్చించారు. వీటిలో నాలుగు అంశాలు రద్దవ్వగా ఒక అంశాన్ని వాయిదా వేశారు. అజెండాలోని అంశాలు చదివి వినిపించిన అనంతరం జీరో అవర్‌ నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రామచంద్రారెడ్డి, డీఈ ఏసయ్య, టీపీవో రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని