logo

బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ.. నిందితుల అరెస్టు

చీరాల షణ్ముక జ్యూయలరీ దుకాణంలో మార్చి 28న బంగారు ఆభరణాల చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Published : 01 Apr 2023 05:38 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల, న్యూస్‌టుడే: చీరాల షణ్ముక జ్యూయలరీ దుకాణంలో మార్చి 28న బంగారు ఆభరణాల చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.నాలుగు లక్షల విలువైన 80 గ్రాములు బరువు కలిగిన ఏడు బంగారు గొలుసులు, చీరాలలోని మరో దుకాణంలో అపహరించిన రూ.25 వేల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర పుణే నగరానికి చెందిన శేఖర్‌ హేమ్రాజ్‌ వాని, జ్యోత్స్న సూరజ్‌ కచ్వి, అనిల్‌ దీపక్‌ జాదవ్‌, పూజా శ్రావణ్‌ పరమార్‌, రక్షా రాజు బగడే మార్చి 28న రాత్రి చీరాల షణ్ముఖ జ్యూయలరీ దుకాణానికి వచ్చి యజమాని పెనుగొండ శ్రీనివాస్‌ను బంగారు గొలుసులు చూపించమని అడిగారు. యజమాని దృష్టి మరల్చి చేతిలోని రుమాల్‌ వేసి ఏడు చైన్లు గుత్తిగా ఉన్న దానిని దొంగలించి వెళ్లిపోయారు. బంగారు గొలుసులు చోరీకి గురైన విషయాన్ని యజమాని గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మల్లికార్జునరావు దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని పరిశీలించి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని సీఐ పోలీసు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితులు గతంలో హనుమకొండలోని కల్యాణ్‌ జ్యూయలరీస్‌ దుకాణంలో ఓ బంగారు గొలుసు దొంగిలించి పుణేలో విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితులను సత్వరమే పట్టుకుని ఆభరణాలు రికవరీ చేసినందుకు సీఐ మల్లికార్జునరావు, ఎస్సై భాస్కరరావును అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు