logo

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Published : 01 Apr 2023 05:38 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు ప్రతీకగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దన్నారు. జిల్లాలో 126 కేంద్రాల్లో ఏప్రిల్‌ 3వతేదీ నుంచి 18వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24354 మంది రెగ్యులర్‌, 1946 మంది ప్రైవేటు విద్యార్థులకు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. కేంద్రాల వద్ద తాగునీరు సరఫరా చేయాలని, వైద్యశాఖ ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా బస్సులు నడపాలని సూచించారు. కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయించాలన్నారు. 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు మూల్యాంకనం చేసే చోట భద్రత కట్టుదిట్టంగా చేపట్టాలని చెప్పారు. డీఆర్వో వినాయకం, డీఈవో శామ్యూల్‌, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రత్యేక బస్సులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైంది రవాణా సౌకర్యం. ఊరి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బొల్లాపల్లి, బెల్లంకొండ, అచ్చంపేట, యడ్లపాడు, మాచర్లలోని గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయం సరిగ్గా లేదు. సాధారణ రోజుల్లో ఎలాగోలా విద్యార్థులు నెట్టుకొచ్చారు. ఇప్పుడు పరీక్షలకు నిర్ధేశిత సమయానికి చేరుకోకపోతే అనుమతించే పరిస్థితి లేదు. ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలంటే కష్టమే. గత అనుభవాల దృష్ట్యా విద్యాశాఖ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ)ని కోరుతోంది. కలెక్టర్‌ శివశంకర్‌ కూడా అవసరమైన ప్రతిచోట ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని ప్రజా రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు చేశారు. దీంతో పది పరీక్షలు జరిగే రోజుల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసే ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, సత్తెనపల్లి డిపోల పరిధిలో 323 ఆర్టీసీ, 114 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో హాల్‌టిక్కెట్‌తో పదో తరగతి విద్యార్థులు ప్రయాణంచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. బస్సుల అవసరం ఎక్కడెక్కడ ఉందనే ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి ఒకేసారి విద్యార్థులందర్నీ పరీక్ష కేంద్రానికి తరలించేలా సర్వీసులు ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. వినుకొండ డిపోకు 12, సత్తెనపల్లికి రెండు, మిగిలిన డిపోలకు 20 నుంచి 30 వరకు వినతులు వచ్చాయి. వాటితోపాటు డీఈవో నుంచి వచ్చే ప్రతిపాదనలేమైనా ఉంటాయా అని డీఎంలు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పది పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. 126 కేంద్రాల్లో 26,300 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా జిల్లా అంతటా ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నట్లు పల్నాడు ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని