logo

YSRCP: మంగళగిరి వైకాపాలో అంతర్యుద్ధం!

రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి.

Updated : 18 May 2023 13:11 IST

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న వేళ ఆయన వైరివర్గం నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆళ్ల లేని సమయంలో ఆయన వ్యతిరేకవర్గానికి చెందిన దొంతిరెడ్డి వేమారెడ్డికి తాడేపల్లి, మంగళగిరి నగర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉండడం, పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో అధిష్ఠానంతో అంతరం పెరిగింది. దీనిని ఆయన వ్యతిరేకవర్గం అనుకూలంగా మార్చుకుని ముందుకెళ్తోంది.
దొంతిరెడ్డి వేమారెడ్డి వర్గం పార్టీలో క్రియాశీలకమై నియోజకవర్గంలోని పార్టీ నేతలను కలిసి అధిష్ఠానం టికెట్‌ ఇచ్చినవారిని గెలిపించుకుందామనే నినాదం తెరపైకి తెచ్చారు. మంగళగిరి, తాడేపల్లితో పాటు దుగ్గిరాల మండలాల్లో నేతలతో భేటీ అవుతున్న దొంతిరెడ్డి వేమారెడ్డి అందరూ కలసి పనిచేద్దామని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకోకుండా ముందుకెళ్దామని కోరుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు తాడేపల్లి, మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆర్కే అనుచరులు పదవులు పోవడం, వ్యతిరేక వర్గానికి కీలకపదవి వరించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. తమ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వకపోగా కొత్తగా కొందరిని పార్టీలోకి చేర్చుకుని వారికి వెంటనే పదవులు కట్టబెట్టడంపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఇది పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అని సరిపెట్టుకున్నామని, అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


తొలి నుంచి అసంతృప్తి వర్గం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు కొందరు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తమకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా కావడం లేదని పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరంతా వైకాపాలోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు ప్రత్యేకంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరి వర్గానికి పదవి దక్కడంతో క్రియాశీలమై నేతలందరినీ కలుస్తున్నారు. వీరితో నియోజకవర్గ స్థాయి నేతలు కూడా కొందరు చేయి కలపడం, కొందరు అంతర్గతంగా మద్దతు తెలపడంతో మంగళగిరిపై పట్టు సాధించే దిశగా కదులుతున్నారు. వేమారెడ్డి అభినందన సభకు నియోజకవర్గంలో ముఖ్య నేతలంతా హాజరు కావడం, ఎమ్మెల్యే వర్గం దూరంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే, ఆయన వ్యతిరేకవర్గం ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పుడు వేమారెడ్డి కబురు చేస్తున్నందున అక్కడికి వెళితే ఎమ్మెల్యే నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అన్న మీమాంసలో కొందరున్నారు. పార్టీ నియమించినందున ఆయనను కలవకపోతే ఎలా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలోనూ పార్టీలో ఒక నేత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగిలిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారందరూ ఇప్పుడు చురుకైన పాత్ర పోషించడానికి ముందుకొస్తున్నారు. సీఎం నివాసం ఉన్న నియోజకవర్గంలోనే గందరగోళ పరిస్థితి నెలకొనడం, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతుంటే అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ నెలలోనే రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. అప్పటికి అమెరికా నుంచి ఎమ్మెల్యే వచ్చి కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్న విషయమై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని