logo

ఆదరాబాదరాగా అమృత్‌ పనులు

నిధులున్నా.. ఇప్పటి వరకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించారు.. కేంద్రం నుంచి అధికార బృందాలు పరిశీలనకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు హడావుడిగా పనులు మొదలుపెట్టారు.

Updated : 29 May 2023 04:55 IST

కేంద్ర బృందాల రాకతో యంత్రాంగం హైరానా  
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
వినుకొండ, నరసరావుపేట గ్రామీణ, న్యూస్‌టుడే

నిధులున్నా.. ఇప్పటి వరకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించారు.. కేంద్రం నుంచి అధికార బృందాలు పరిశీలనకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు హడావుడిగా పనులు మొదలుపెట్టారు.. ఇదీ అమృత్‌ సరోవర్‌ పథకం కింద చెరువుల సుందరీకరణ పనులు తీరు. ఏడాదిగా పట్టించుకోని చెరువుల అలుగుల మరమ్మతు పనులకు ఇప్పుడు అనుమతించారు. కంప చెట్లు తొలగించి కట్టలను చదును చేస్తున్నారు. గతంలో కట్టలపైన నాటిన మొక్కలు చాలాచోట్ల ఎండిపోవడంతో కొత్తవి నాటేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 80 చెరువులలో 56 పూర్తిచేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో చాలాచోట్ల మళ్లీ పనులు చేపట్టడం విశేషం.

గత ఏడాది ఏప్రిల్‌ 24న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమం ద్వారా చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒక్కో జిల్లాలో 75 చెరువులకు తగ్గకుండా పునరుజ్జీవింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పల్నాడు జిల్లాలో 80 ఊర చెరువులను ఎంపిక చేశారు. కంప చెట్లను తొలగించి కట్టలపైన నడక బాట ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, దాతల సాయంతో కూర్చొనేందుకు బల్లాలు సమకూర్చడంతో పాటు పూడిక తీయడం, చెరువులోకి నీరు వచ్చి వెళ్లేందుకు వీలుగా అలుగులు బాగు చేయడం ఇందులో ముఖ్యమైన పనులు. ఇందుకు ప్రత్యేక ఆర్థిక కేటాయింపులేనప్పటికీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్థానిక సంస్థలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు, వాటర్‌షెడ్‌ కార్యక్రమాలను అనుసంధానం చేసి పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. సామాజిక సేవల్లో భాగంగా ప్రజలు, సంస్థల నుంచి విరాళాలు తీసుకునేందుకు అనుమతించారు. చెరువు ఎకరానికి తగ్గకుండా 10వేల క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా చూడాలి. కట్ట చుట్టూ వేప, మర్రి వంటి మొక్కలు నాటి జాతీయ జెండా కోసం సిమెంట్‌ దిమ్మె నిర్మించాలి. ప్రతి చెరువు ఆ ప్రాంతానికి ఒక సామాజిక కేంద్రంగా మారాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సుందరీకరణ పనులు పూర్తి చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలను స్థానికంగా గ్రామ పంచాయతీలకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు.

ఎండిన  మొక్కలు

గతంలో నాటిన మొక్కలను పట్టించుకోకపోవడంతో జిల్లాలో చాలాచోట్ల అవి ఎండిపోయాయి. నూజండ్ల మండలం తెల్లబాడు, పి.ఉప్పలపాడు చెరువు గట్లపై గత ఏడాది వేసిన మొక్కలు ఒక్కటీ బతకలేదు. మొక్క చుట్టూ కంపతో రక్షణ కల్పిస్తే రూ.125, నీరు పోసి సంరక్షణ కోసం రోజుకు రూ.4 వంతున 250 పనిదినాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద చెల్లించేందుకు అవకాశం కల్పించినప్పటికీ అమలు కాలేదు. రెండున్నర మీటర్ల వెడల్పు ఉన్న కట్టపైన నడక దారి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల జరగలేదు. పగిలిన స్లూయిస్‌ల నిర్మాణానికి నిధుల్లేక గత ఏడాది ఒక్క పని చేపట్టలేదు. తాజాగా మరమ్మతులకు చెరువుకు రూ.2 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతించడంతో ఈ సంవత్సరం ఆయా పనులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సామాజిక సేవలలో భాగంగా మైరాడా స్వచ్ఛంద సంస్థ జిల్లాలోని వివిధ చెరువుల మరమ్మతు పనులలో పాలుపంచుకుంది. తమ వంతుగా రూ.48.53 లక్షలు ఖర్చు చేసింది. పూడిక తీత, కట్టలకు రివిట్‌మెంట్‌ చేయడం వంటి పనులు చేపట్టింది.

పనుల నాణ్యత ఎంత వరకు?

త్వరలో కేంద్ర బృందాలు చెరువుల సందర్శనకు రానున్న నేపథ్యంలో పనులు హడావుడిగా పూర్తి చేయిస్తున్నారు. జిల్లా స్థాయిలో పనుల పర్యవేక్షణ కోసం ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి చెరువుకు స్థానికంగా ఉన్న ఉపాధి సిబ్బందిలో ఒకరిని బాధ్యుడిగా నియమించారు. ఇందులో భాగంగానే వినుకొండ మండలం విఠంరాజుపల్లె చెరువు కట్టను యంత్రాలతో యుద్ధప్రాతిపదికన చదును చేస్తున్నారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల చెరువు కట్టపైన పెరిగిన కంపను ఇటీవల తొలగించారు. ఇలా అన్నిచోట్ల హడావుడిగా చేస్తున్న ఈ పనుల నాణ్యత ఎంత అన్నది ప్రశ్నర్థకంగా మారింది. అన్నీ సక్రమంగా పూర్తయితే ప్రతి చెరువు గ్రామీణ ప్రాంతంలో అమృత్‌ సరోవర్‌గా మారనుంది.


బాగున్న వాటికి ప్రోత్సాహాకాలిస్తాం

- జి.జోసెఫ్‌కుమార్‌, ఉపాధి హామీ పథకం జిల్లా సంచాలకుడు

ఎండినచోట కొత్త మొక్కలు నాటిస్తాం. అవకాశం ఉన్న ప్రతి చెరువు కట్టపై నడక దారి నిర్మించాలని ఆదేశాలిచ్చాం. పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర బృందాలు రాక ముందు లోటుపాట్లను పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారుల బృందం సందర్శించి సూచనలు చేస్తుంది. సుందరీకరణలో ఆదర్శంగా ఉన్న మూడింటిని గుర్తించి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా నగదు బహుమతులు అందించాలని నిర్ణయించాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని