logo

రిజిస్ట్రేషన్‌ మాయాజాలం!

ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చినా ఫర్వాలేదు గానీ మా కమీషన్లు మాకు వస్తే చాలనుకుంటున్నారు స్టాంపులు- రిజిస్ట్రేషన్‌శాఖకు చెందిన కొందరు అధికారులు.

Published : 29 May 2023 04:35 IST

మార్కెట్‌ విలువల తగ్గింపునకు లాలూచిపడి..
ప్రభుత్వ ఖజానాకు గండి
ఈనాడు, అమరావతి

ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చినా ఫర్వాలేదు గానీ మా కమీషన్లు మాకు వస్తే చాలనుకుంటున్నారు స్టాంపులు- రిజిస్ట్రేషన్‌శాఖకు చెందిన కొందరు అధికారులు. ఆ మధ్య పల్నాడు జిల్లా వినుకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకే ఒక్క డాక్యుమెంట్‌లో రూ.3 లక్షలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా చాలా తక్కువ మొత్తంలో పెట్టి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక్కడ దస్తావేజు లేఖరు మాయాజాలం ప్రదర్శించారు. డాక్యుమెంట్‌లో ఉండాల్సిన ధర కన్నా తక్కువ మొత్తం ప్రతిపాదిస్తే కాసుల యావలో తరిస్తున్న అధికారులు అది ఏమాత్రం గుర్తించకుండా రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఆ మాయాజాలం ఆడిట్‌ అధికారుల నిశిత పరిశీలనలో బయటపడింది. వారి పరిశీలనలోనూ అది బయటపడకపోతే ఆ మేరకు ప్రభుత్వం నష్టపోయేది. తిరిగి ఆ మొత్తాన్ని కట్టించాలని సబ్‌రిజిస్ట్రార్‌కు షోకాజ్‌ జారీ చేశారు. దీంతో ఆ మొత్తం తిరిగి ప్రభుత్వానికి కట్టించారు. ఆడిట్‌లో బయటపడని ఇలాంటి డాక్యుమెంట్లు మరెన్నో.

ప్రతి నెలా సబ్‌రిజిస్ట్రార్లు చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లపై శాఖకు చెందిన ఆడిట్‌ యంత్రాంగం కొన్ని డాక్యుమెంట్లను ర్యాండమ్‌గా తీసుకుని ఆన్‌లైన్‌లోనే ఆడిట్‌ చేస్తుంది. ఈ క్రమంలోవారు ప్రధానంగా ప్రభుత్వం పేర్కొన్న మాదిరి డాక్యుమెంట్‌లో రిజిస్ట్రేషన్‌ ధరలు ప్రతిపాదించారా లేదా? అదేమైనా నిషేధిత భూముల జాబితాలో ఉందా? తనఖాలో ఎక్కడైనా ఉందా అనే వివరాలు ధ్రువీకరించుకుంటారు. వారి పరిశీలనలో వినుకొండ కార్యాలయంలో ఓ డాక్యుమెంట్‌లో మార్కెట్‌ విలువలు తక్కువగా ప్రతిపాదించడం గుర్తించి ఆ జిల్లా రిజిస్ట్రార్‌ను అప్రమత్తం చేశారు. అది స్థిరాస్తి వెంచర్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌ అని దస్తావేజు లేఖరే అధికారులను బురిడీ కొట్టించారని, దాన్ని అధికారులు చెక్‌ చేసుకోకుండా రిజిస్ట్రేషన్‌ చేయటంతో ఈ తప్పిదం జరిగిందని చెబుతున్నారు.

గుంటూరు పొన్నూరు రోడ్‌లోనూ ఓ దస్తావేజులో సుమారు రూ.12లక్షలు నష్టం వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న స్థలానికి అదే లొకేషన్‌లో రోడ్డుకు చాలా లోపల ఉన్న ఆ సర్వే నంబరులో ఉన్న తక్కువ ధర ప్రతిపాదించి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలింది. ఇది కూడా ఆడిట్‌ అధికారుల పరిశీలనలోనే వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ రిజిస్ట్రేషన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపోయిన ఆదాయాన్ని తిరిగి కట్టించలేదు. అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. విజయవాడకు చెందిన దస్తావేజు లేఖరి ఆ డాక్యుమెంట్‌ను గుంటూరులో రిజిస్ట్రేషన్‌ చేయించారు. డాక్యుమెంట్‌ రైటర్‌కు ఉన్నతాధికారి ఒకరికి మధ్య సత్సంబంధాల నేపథ్యంలో ఆ డాక్యుమెంట్‌లో వ్యత్యాసాన్ని ఇప్పటి వరకు కూడా కట్టించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు.

పల్నాడు జిల్లాలో మరో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బ్యాంకులో తనఖా ఉన్న ఆస్తిని సైతం ఎడాపెడా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ అధికారి నిర్వాకంతో బ్యాంకు అధికారులు నష్టపోయారు. ఈ తప్పిదం ఆడిట్‌ అధికారుల పరిశీలనతో వెలుగుజూసింది. ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు దానిపై ఏమైనా తనఖాలు ఉన్నాయా అనేది కూడా అధికారులు ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోవాలి. కానీ అలా చేయలేదని, ఇది సబ్‌రిజిస్ట్రార్‌ తప్పిదమని తేల్చి సంబంధిత అధికారిపై చర్యలకు ప్రతిపాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని