logo

దండిగా అక్రమార్జన

వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం ఇంటూరులో వైకాపా నేత అతిథి గృహంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మంగళగిరిలోని సెబ్‌ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు మెరుపుదాడి చేసి 24 మంది జూదరులను అరెస్టు చేసి రూ.3.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Published : 29 May 2023 04:35 IST

జూద శిబిరాల నిర్వహణ.. గ్రావెల్‌, ఇసుక తవ్వకాలు
అధికారమే అండగా చెలరేగిపోతున్న వైకాపా నేతలు
బాపట్ల, న్యూస్‌టుడే

వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం ఇంటూరులో వైకాపా నేత అతిథి గృహంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మంగళగిరిలోని సెబ్‌ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు మెరుపుదాడి చేసి 24 మంది జూదరులను అరెస్టు చేసి రూ.3.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చాలా రోజులుగా జూదం ఆడిస్తున్నా, స్థానిక పోలీసులు తమకు తెలియదన్నట్లుగా మిన్నకుండిపోయారు. బడా బాబులు జూదం ఆడుతూ రోజూ రూ.లక్షల్లో నగదు చేతులు మారుతున్నా జిల్లా అధికారుల దృష్టికి సైతం రాకపోవడం గమనార్హం. జూద శిబిరం నిర్వహిస్తున్న నేతే మట్టి అక్రమ తవ్వకాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

జిల్లాలో కొంతమంది అధికార పార్టీ నేతలు తమ అతిథిగృహాలు, వ్యవసాయ క్షేత్రాల్లో మినీ క్యాసినోలు, జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. జూదం ఆడిస్తే రోజూ రూ.వేలల్లో లాభం వస్తుండటంతో నేతలు నిర్వాహకులుగా అవతారం ఎత్తుతున్నారు. స్థానిక అధికారుల చేతులు తడుపుతూ ఏ స్థాయిలో అక్రమాలు జరిగినా మిన్నకుండిపోయేలా చేస్తున్నారు. కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పేకాట, కోడి పందాలు నిర్వహిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో మూడున్నరేళ్ల క్రితం ప్రారంభమైన జూదశాలల నిర్వహణ క్రమంగా జిల్లా మొత్తం విస్తరించింది. జిల్లా కేంద్రం బాపట్ల శివారున ఓ వైకాపా నేతకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ వందల సంఖ్యలో పందెం కోళ్లు పెంచుతున్నారు. ఇతర జిల్లాల నుంచి పందెం రాయుళ్లను పిలిపించి రూ.లక్షల్లో పందేలు వేస్తున్నారు. ఇటీవల ఇద్దరు వైకాపా నేతలు వ్యవసాయ క్షేత్రంలో జూదశాల నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి రూ.లక్షకు పైగా నగదు జూదరులను పట్టుకున్నారు. పైస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావటంతో దాడి వివరాలు బయటకు వెల్లడించలేదు. మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.


ఇష్టానుసారం తోడేస్తున్నారు..

ద్దంకిలో గ్రావెల్‌, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ కీలకనేత శింగరకొండ సమీపంలోని అద్దంకి కొండను జేసీˆబీలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. తవ్వకాలు ఆపిస్తే తమపై బదిలీ వేటు పడుతుందన్న భయంతో మైనింగ్‌, రెవెన్యూ అధికారులు మౌనముద్ర దాల్చారు. నేత అక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు. అద్దంకి సమీపంలో గుండ్లకమ్మ, మోదేపల్లి వద్ద చిలకలేరు వాగులో ఇసుక తోడేస్తున్నారు. మట్టి, ఇసుక ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు ఇసుక వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అనుమతులకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక, బుసక తవ్వి లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలపై సొంత పార్టీ ప్రజాప్రతినిధే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం.


ఫిర్యాదు చేస్తే పట్టించుకొనేవారేరి?  

నగరం మండలంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి, నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారు. మురుగు కాలువలను వదలకుండా జేసీˆబీలతో తవ్వేస్తున్నారు. భారీ వాహనాల్లో మట్టి, ఇసుక తరలించి జేబులు నింపుకుంటున్నారు. సిరిపూడి వద్ద వారం రోజులుగా జేసీబీలతో పగలు, రాత్రులు ఇసుక తవ్వేసి టిప్పర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సెబ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.  నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 25 అడుగుల లోతున తవ్వుతుండటంతో అక్రమ క్వారీలు చెరువులుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని నగరం మండలంలో అక్రమ తవ్వకాలపై చినమట్లపూడి వాసులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కొన్ని రోజులు హడావుడి చేసి బడా నేత ఆదేశాలతో చేతులు ఎత్తేశారు.


అద్దంకి ప్రాంతంలో అధికార పార్టీ నేతల తవ్వకాలపై ఉన్నతాధికారులకు ప్రతిపక్ష ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పోటాపోటీగా గ్రావెల్‌, రేషన్‌ మాఫియా నడుపుతున్నారు. మార్టూరు మండలంలో గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి ఓ బడా నేత, కీలక నేత అనుచరుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అక్రమార్జన విషయంలో వైకాపా నేతల మధ్య విభేదాలు తలెత్తి ఏకంగా సీఎంవో, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. వేటపాలెం, చినగంజాం మండలాల్లో పోటాపోటీగా ఇసుక తవ్వకాలు చేపట్టి విక్రయాలు చేస్తున్నారు. అక్రమాలపై గతంలో హడావుడి చేసిన సెబ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రస్తుతం పూర్తిగా చేతులెత్తేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని