logo

మోసాలు.. బయటికొస్తున్నాయ్‌

అచ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్‌.. లాగిన్‌ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.

Published : 29 May 2023 04:35 IST

ప్రభుత్వ ఉద్యోగులతో రేఖాశ్రీ కుమ్మక్కు
వారికి డబ్బులు ముట్టజెప్పి శిక్షణ తతంగం
నకిలీ ఎస్‌ఆర్‌లతో నిరుద్యోగులకు టోపీ
ఈనాడు, అమరావతి,న్యూస్‌టుడే,సూర్యారావుపేట

చ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్‌.. లాగిన్‌ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.. నెలానెలా ఠంఛనుగా బ్యాంకు ఖాతాలో జీతం.. కళ్ల ముందే అన్నీ కనిపిస్తుండడంతో నిజమే అని నిరుద్యోగ యువత నమ్మారు. రూ.లక్షల్లో డబ్బు ముట్టజెప్పి చేరారు. చివరకు వ్యవహారం తిరగబడడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతను మోసం చేసిన రేఖశ్రీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సూర్యారావుపేట పోలీసులు ఆమెను శనివారం అరెస్టు చేశారు. నిందితురాలిపై వివిధ జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 11 కేసులు ఉన్నట్లు తేలింది.


పాత పరిచయాలు ఉపయోగించుకుని..

క్కో శాఖలో ఒక్కో ఉద్యోగితో మిలాఖత్‌ అయి.. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి నిరుద్యోగులకు అనుమానం రాకుండా వ్యవహారం అంతా నడిపిస్తుంది. విద్యుత్తు శాఖ, అంగన్‌వాడీ, రెవెన్యూ.. ఇలా శాఖల్లో కొంత మందితో నిందితురాలు మాట్లాడుకుంది. వారికి డబ్బులు ఇచ్చి ఒప్పించింది. నిరుద్యోగులకు ప్రొబేషన్‌ కాలంలో వారి కార్యాలయంలోనే నామమాత్రంగా శిక్షణ ఇప్పించింది. ప్రభుత్వ కార్యాలయమే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఇదంతా చేస్తుంది. ఉద్యోగం అంటూ వారి నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చింది. రేఖశ్రీ గతంలో ఉయ్యూరులో వీఆర్వోగా పనిచేసింది. అప్పటి పరిచయాలతో ఆమెకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకుని సహకరించారు.తమకు పని ఉండడం లేదని అభ్యర్థులు అడిగితే.. ప్రారంభంలో పెద్ద పనేం ఉండదని నిందితురాలు నమ్మించింది. నిరుద్యోగులకు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు రేఖశ్రీ శిక్షణకు పంపించినట్ల పోలీసుల విచారణలో తేలింది. విచారణలో వారు ఈ వ్యవహారం గురించి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తే రేఖశ్రీకి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనేది వెలుగుచూసే అవకాశం ఉంది.


నియామక పత్రంతో పాటే సర్వీసు రిజిస్టర్‌

శిక్షణలో చేరిన సమయంలోనే నిందితురాలు అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే సర్వీసు రిజిస్టర్‌ను కూడా అభ్యర్థుల ఇళ్లకు పోస్టులో పంపించింది. ఇందులో సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలను పొందుపర్చి తయారు చేసింది. వేలిముద్రలు, హోదా, జీతం, ఉద్యోగంలో నియమితులైన తేదీ, తదితర అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. దీంతో నిజమే అని నిరుద్యోగులు నమ్మారు. కానీ సర్వీసు రిజిస్టర్‌ను ఇంటికి పంపడంపై కొంత మంది నిందితురాలిని ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌ అనేది పై అధికారి వద్ద ఉంటుంది కదా.. మాకు ఎందుకు పంపించారు? అని అడిగారు. ఉన్నతాధికారి వద్ద కూడా ఉంటుంది.. మీకు డూప్లికేట్‌ కాపీ ఇస్తున్నాం.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరామని మీకు భరోసా కల్పించేందుకు ఇచ్చానని ఆమె నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగుల వెబ్‌సైట్‌ అని భ్రమింపజేసేలా దీనిని కూడా సొంతంగా తయారు చేయించినట్లు బయటపడింది. ఇందులో లాగిన్‌ అయ్యేందుకు ప్రతి ఒక్కరికి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కూడా ఇచ్చింది. ఇందులో ఉద్యోగుల పేరు, చిరునామా, పనిచేసే కార్యాలయం, ఫొటో, సంతకం, తదితర వివరాలు పొందుపర్చింది. ఇంత పకడ్బందీగా రేఖశ్రీ వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. మోసపోయిన నిరుద్యోగులు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే నిందితురాలు నిరాకరిస్తోంది. తన వద్ద డబ్బులేదని, ఏమీ చేయలేనని, అవసరమైతే జైలుకైనా వెళ్తానని సమాధానం ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం 15 మంది వరకు బాధితులు సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ముందుకు వస్తేనే ఎంత మేరకు మోసం జరిగిందో గుర్తించవచ్చని పోలీసులు చెపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు