logo

ఇంకెందరు బలికావాలి?

కృష్ణా నదీ తీరంలో మృత్యు ఘోష ఆగడం లేదు. సరదాగా నదీ స్నానాలకు దిగుతున్న యువకులు, చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు..

Published : 30 May 2023 05:22 IST

కృష్ణానదిలో ఇసుక గోతులే మృత్యుకూపాలు
పిల్లలు చనిపోయి తల్లులకు గర్భశోకం

సీతానగరం ఘాట్‌ వద్ద లోతైన గుంతలున్న ప్రాంతం

ఈనాడు, అమరావతి: కృష్ణా నదీ తీరంలో మృత్యు ఘోష ఆగడం లేదు. సరదాగా నదీ స్నానాలకు దిగుతున్న యువకులు, చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు.. ఏళ్ల తరబడి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా స్థానిక సంస్థలు, పోలీసు యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ తీరంలో భారీ గోతులు ఏర్పడుతున్నాయి.. ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా ప్రమాదాన్ని సూచిస్తూ జాగ్రత్తగా ఉండాలని బోర్డులు కూడా ఏర్పాటు చేయలేమా? ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారగణం స్పందిస్తుంది?

ఇసుకాసురుల దాహానికి ప్రాణాలు బలి

ప్రథమ పంచారామం అమరావతిలో స్థానికుల కంటే ఇతరులు ఎక్కువగా నదిలో ప్రమాదవశాత్తూ పడి మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అమరావతి ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతం కావడంతో నిత్యం ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. దీనికితోడు ఇక్కడ నదిలో కర్మకాండలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువ. ఏటా ఇక్కడ వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. ఆటవిడుపు కోసం పిల్లలు కూడా అమరావతికి వస్తుంటారు. ఈ క్రమంలో నదిలో స్నానానికి దిగి లోతు తెలియక అమాయకులు మృత్యువాత పడుతున్నారు. అమరావతిలో కృష్ణానది తీరంలో ఒడ్డు పక్కనే పెద్దఎత్తున ఇసుక తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్దాయి. దీనికితో నదిలో ఇసుక తవ్వకాలు చేసేవారు దారులు ఏర్పాటు చేయడంతో ఒడ్డు వెంబడి గోతుల్లో నీరు నిలిచింది. పుష్కరఘాట్‌ల సమీపంలో లోతు తక్కువగా ఉండడంతో అందరూ స్నానానికి దిగుతున్నారు. ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లగానే భారీ గోతుల్లోకి జారిపోయి బయటికి రాలేక మునిగి మృత్యువాత పడుతున్నారు.

రక్షణ చర్యలు శూన్యం

అచ్చంపేట మండలం నుంచి రేపల్లె మండలం వరకు కృష్ణాతీర ప్రాంతం ఉంది. ఇందులో మాదిపాడు, గింజుపల్లి, చామర్రు, దిడుగు, ధరణికోట, అమరావతి, ఉండవల్లి, సీతానగరం, కనకదుర్గమ్మవారధి ప్రాంతాలు అత్యంత ప్రమాదకరం. ఇక్కడ సమీపంలోనే ఆవాసాలు ఉండడంతో ప్రతి అవసరానికి నదిలోకి దిగుతున్నారు. ఎక్కడా ప్రమాదాలను తెలిపే సూచిక బోర్డులు లేవు.సీతానగరం ఘాట్‌లో పోలీసు ఔట్‌ పోస్టులో సిబ్బంది ఉన్నా పిల్లలు మాత్రమే నీటిలో లోపలికి దిగి స్నానాలు చేస్తున్నారు. సోమవారం ‘ఈనాడు’ పరిశీలన సమయంలో పది మంది పిల్లలు ఈత కొడుతూ కనిపించారు.

ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటనల్లో కొన్ని....

కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో సీతానగరం పుష్కరఘాట్‌లోని రైల్వేవంతెన కోసం వేసిన పిల్లర్ల చుట్టూ భారీ గోతులు ఏర్పడ్దాయి. ఇక్కడ లోతు తెలియక స్నానానికి దిగినవారు మృత్యువాత పడుతున్నారు. గత శుక్రవారం తాడేపల్లిలోని డోలాస్‌నగర్‌కు చెందిన ఆరుగురు పిల్లలు ఇక్కడ ఆటవిడుపునకు వచ్చి స్నానానికి దిగగా డేరంగుల కృష్ణయ్య(16), డేరంగుల శివశంకర్‌(17) నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చారు.

కృష్ణానదిలో నిర్మించిన కనకదుర్గమ్మ వారధి సమీపంలో భారీ గోతులు ఉన్నాయి. గత శుక్రవారం ఇక్కడ పశువుల కాపరి ప్రకాష్‌రాజు(25) ప్రమాదవశాత్తూ గోతిలో పడి మృత్యువాత పడ్డారు. ఇతను ఏలూరు జిల్లా పెదవేడి మండలం లక్ష్మీపురానికి చెందినవారు.

ప్రకాశం బ్యారేజీ ఎగువన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం వద్ద ఏప్రిల్‌ 15న విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐటీ ఇంజినీరు జయకృష్ణ(23) స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. దీంతో తాత్కాలికంగా ఇక్కడ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. అయితే కంచెను పక్కకు జరిపి యువత ఈతకు దిగుతూనే ఉన్నారు. సోమవారం ఈనాడు పరిశీలన సమయంలోనూ ఇక్కడ స్నానం చేస్తున్నారు.

ప్రాణాలు జలార్పణం

* గత నాలుగేళ్లలో అమరావతి మండలంలోని దిడుగు, ధరణికోట, అమరావతి పరిధిలో 23 మంది కృష్ణానదిలో ప్రమాదవశాత్తూ పడి చనిపోయారు. ఇందులో 8 మంది స్థానికులు కాగా మిగిలినవారందరూ స్థానికేతురులే కావడం గమనార్హం.

* అచ్చంపేట మండలంలో గింజుపల్లి వద్ద జనవరి 2022లో పవన్‌కల్యాణ్‌ నాయక్‌ (26), అక్టోబరు 2022లో చామర్రు వద్ద నరసింహారావు (50) నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. 

* అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ సమీపంలో నదిలో 2021 అక్టోబరు 12న స్నానానికి దిగిన వేద పాఠశాల విద్యార్థులు ఆరుగురు నదిలో మునిగి చనిపోయారు.

ఇలా చేస్తే అరికట్టవచ్చు...

* కృష్ణానది తీరంలో తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సంస్థల యంత్రాంగం నిఘా పెట్టాల్సి ఉంది.

* నదిలో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరూ దిగకుండా రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. 

* అమరావతి, ఉండవల్లి, సీతానగరం ఘాట్ల వద్ద నిరంతర పోలీసు గస్తీ ఏర్పాటు చేస్తే ప్రమాదకర ప్రాంతాల్లో స్నానాలకు లోతుకు దిగకుండా చూడటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. 

* పుష్కరఘాట్లలో ఎటుచూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. పోలీసుల నిఘా పెరిగితే వీటన్నిటికి అడ్డుకట్ట పడుతుంది.

* అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన రెయిలింగ్‌ వంటి ఏర్పాటు చేయాలి.

ఉండవల్లి వద్ద వాగులోకి వెళ్లకుండా వేసిన కంచె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని