logo

పాతికేళ్లుగా నివాసం.. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు

వారంతా కూలి పనులు చేసుకునే పేదలు. పాతికేళ్ల కిందట పెదకాకానిలోని ఎన్టీఆర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వారుంటున్నది దేవాదాయ శాఖ భూమి అని, 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ కాలనీవాసులకు నోటీసులు ఇచ్చారు.

Published : 30 May 2023 05:22 IST

స్పందనలో అర్జీ ఇచ్చేందుకు వచ్చిన ఎన్టీఆర్‌ కాలనీ వాసులు

కలెక్టరేట్‌(గుంటూరు): వారంతా కూలి పనులు చేసుకునే పేదలు. పాతికేళ్ల కిందట పెదకాకానిలోని ఎన్టీఆర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వారుంటున్నది దేవాదాయ శాఖ భూమి అని, 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ కాలనీవాసులకు నోటీసులు ఇచ్చారు. పాతికేళ్లుగా నివాసం ఉంటున్న స్థలం నుంచి ఉన్నట్టుండి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు వాపోతున్నారు. కాలనీగా ఏర్పడిన తర్వాత పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నామని, విద్యుత్తు బిల్లులు కడుతున్నామని, స్థానికంగా అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఇప్పుడు నివాసాలను ఖాళీ చేయాలంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెదేపా మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయమంటే వారెక్కడికి వెళ్లాలో చెప్పాలన్నారు.  స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎన్టీఆర్‌ పేరుతో కాలనీ ఉండటంతో  ఎవ్వరికీ స్థలాలు అందలేదన్నారు. అన్ని సదుపాయాలు కల్పించిన స్థలాలు ఇస్తే తాము బయటకు వెళ్లేందుకు సిద్ధమని బాధితులంటున్నారు. వినతిపత్రం అందించిన వారిలో తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి రుక్మిణి, తెదేపా నాయకులు రామ్మోహన్‌, బాధితులు మహబూబ్‌, కె.రాంబాబు, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని